1 కొరింథీయులకు 14:13-25

1 కొరింథీయులకు 14:13-25 TELUBSI

భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును. లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు–ఆమేన్ అని వాడేలాగు పలుకును? నీవైతే బాగుగానే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభి వృద్ధి పొందడు. నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి. –అన్యభాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయ బడియున్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవి శ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాటలాడుచున్నారని అనుకొందురు కదా? అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును. అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.