1 కొరింథీయులకు 14:1-12

1 కొరింథీయులకు 14:1-12 TELUBSI

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి. ఎందు కనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆద రణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడకపోయినయెడల, నావలన మీకు ప్రయోజనమేమి? పిల్లనగ్రోవి గాని వీణె గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును? మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చు నప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు. మాటల అర్థము నాకు తెలియకుండినయెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.