ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలిసికొనవలెను. మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ము చున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు. మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనముచేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచు దురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని–యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమునుగూర్చియు రక్తమునుగూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతిమనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.
చదువండి 1 కొరింథీయులకు 11
వినండి 1 కొరింథీయులకు 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీయులకు 11:16-34
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు