సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి; అందరును మోషేనుబట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. –జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి. మీరు సణుగ కుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయ బడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? –మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా? మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము. శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పి తములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?
చదువండి 1 కొరింథీయులకు 10
వినండి 1 కొరింథీయులకు 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీయులకు 10:1-22
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు