1 దినవృత్తాంతములు 5
5
1ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెనుగాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మస్వాతంత్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలుచేయబడలేదు. 2యూదా తన సహోదరులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్యము యోసేపు దాయెను. 3ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ. 4యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, 5షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, 6బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను. 7వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును, 8యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి. 9వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారముకాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి. 10సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.
11గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి. 12వారిలో యోవేలు తెగ వారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి. 13వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబ యోరై యకాను జీయ ఏబెరు. 14వీరు హూరీ అను వానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యరోయ గిలాదునకు గిలాదు మిఖాయేలునకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి. 15గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరులయిండ్లవారికి పెద్ద. 16వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామములయందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి. 17వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలురాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి.
18రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి. 19వీరు హగ్రీయులతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి. 20యుద్ధమందువారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను 21గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి. 22యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడువరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.
23మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతమువరకును వ్యాపించిరి. 24వారి పితరులయిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమపితరులయిండ్లకు పెద్దలైరి. 25అయితే వారు తమపితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. 26కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపెట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 దినవృత్తాంతములు 5: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.