1 దినవృత్తాంతములు 22
22
1మరియు–దేవుడైన యెహోవా నివాసస్థలము ఇదేయని ఇశ్రాయేలీయులర్పించు దహనబలులకు పీఠము ఇదే యని దావీదు సెలవిచ్చెను. 2తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను. 3వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని 4ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయులును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి. 5–నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను.
6తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 7మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను–నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవానామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా 8యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను– నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేలమీదికి ఓడ్చితివి. 9నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టుఉండు అతని శత్రువులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. 10అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడైయుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్యసింహాసనమును నిత్యము స్థిరపరచుదును. 11నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. 12నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక. 13యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడినయెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము. 14ఇదిగో నేను నా కష్టిస్థతిలోనే ప్రయాసపడి యెహోవా మందిరముకొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక. 15మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసెపనివారును వడ్రవారును ఏవిధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు. 16లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.
17మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతులకందరికిని ఆజ్ఞాపించెను. 18ఎట్లనగా–మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలన తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చియున్నాడుగదా? దేశనివాసులను ఆయన నాకు వశపరచియున్నాడు, యెహోవా భయమువలనను ఆయన జనుల భయమువలనను దేశము లోపరచబడియున్నది. 19కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామముకొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 దినవృత్తాంతములు 22: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.