1 దినవృత్తాంతములు 17:16-27

1 దినవృత్తాంతములు 17:16-27 TELUBSI

రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను–దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది? దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చియున్నావు. నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతనుగూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు. నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహోవావైన నీవు వారికి దేవుడవై యున్నావు యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటి కిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక. దేవా –నీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియ జేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా, నీవు దేవుడవైయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును.