1 దినవృత్తాంతములు 11:1-9

1 దినవృత్తాంతములు 11:1-9 TELUBSI

అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చి–చిత్తగించుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివి–నా జనులగు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకురాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూయేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి. తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు–నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆయాధిపత్యమును పొందెను. తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపుర మను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.