YouVersion logo
Dugme za pretraživanje

మత్తయి సువార్త 18

18
పరలోకరాజ్యంలో ఎవరు గొప్ప
1ఆ సమయంలోనే శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పరలోకరాజ్యంలో అందరికంటే గొప్పవాడెవరు?” అని అడిగారు.
2అప్పుడు యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలుచుకొని వారి మధ్యలో నిలబెట్టి ఈ విధంగా చెప్పారు, 3“మీరు ఈ చిన్నపిల్లలవలె మారితేనే కాని పరలోకరాజ్యంలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 4కాబట్టి ఈ చిన్నపిల్లల్లా తమను తాము తగ్గించుకునేవారు పరలోకరాజ్యంలో గొప్పవారు. 5ఇలాంటి ఒక చిన్నబిడ్డను నా పేరట చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు.
ఆటంకపరిచినట్లైతే
6“ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే వారి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు. 7నా విషయంలో ప్రజలను ఆటంకపరిచే వాటిని బట్టి లోకానికి శ్రమ. అయితే అలాంటి శోధనలు తప్పవు కాని అవి ఎవరి వలన వస్తున్నాయో, వానికి శ్రమ. 8నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ చేయి లేదా నీ కాలు కారణమైతే వాటిని నరికి నీ దగ్గర నుండి పారవేయ్యి. రెండు చేతులు, రెండు కాళ్లు కలిగి నిత్యం మండుతున్న అగ్నిలో పడవేయబడే కంటే, కుంటివానిగా లేదా అవయవాలు లేనివానిగా జీవంలో ప్రవేశించడం నీకు మేలు. 9నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీవు రెండు కళ్లు కలిగి నరకంలో పడవేయబడటం కంటే, ఒక కన్నుతో జీవంలోనికి ప్రవేశించడం నీకు మేలు.
తప్పిపోయిన గొర్రెల యొక్క ఉపమానం
10“ఈ చిన్నపిల్లల్లో ఒకరిని కూడా తక్కువగా చూడకండి, ఎందుకంటే పరలోకంలో ఉన్న వీరి దూతలు ఎల్లప్పుడు పరలోకంలోని నా తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారని మీతో చెప్తున్నాను. 11ఎట్లనగా, ‘తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికే మనుష్యకుమారుడు వచ్చాడు.’#18:11 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు
12“ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఏమి చేస్తాడని మీకు అనిపిస్తుంది? తొంభై తొమ్మిది గొర్రెలను కొండలమీద వదిలిపెట్టి, తప్పిపోయిన ఆ ఒక గొర్రెను వెదకడానికి వెళ్లడా? 13ఒకవేళ అతనికి అది దొరికితే, తొంభై తొమ్మిది గొర్రెల కంటే తప్పిపోయి దొరికిన ఆ గొర్రె గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 14అలాగే ఈ చిన్నవారిలో ఒకరైనా నశించడం పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టం లేదు.
సహోదరుడు లేదా సహోదరి పాపం చేస్తే
15“ఒకవేళ నీ సహోదరుడు లేదా సహోదరి పాపం చేస్తే నీవు వెళ్లి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు గురించి వారిని గద్దించు. ఒకవేళ వారు నీ మాట వింటే నీవు వారిని సంపాదించుకున్నట్లే. 16వారు వినకపోతే, ‘ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద ప్రతి విషయం స్థిరపరచబడునట్లు’#18:16 ద్వితీ 19:15 నీతో పాటు ఒకరిని లేదా ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్లు. 17వారు ఇంకా మాట వినకపోతే, ఆ సంగతిని సంఘానికి తెలియజేయండి. వారు సంఘం మాట కూడా వినకపోతే వారిని ప్రక్కన పెట్టి ఒక దేవుని ఎరుగనివారిగా లేదా పన్ను వసూలుచేసేవారిగా పరిగణించండి.
18“మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
19“ఇంకొక విషయం, ఒకవేళ మీలో ఇద్దరు దేన్ని గురించియైన భూమి మీద ఏకీభవించి అడిగితే అది పరలోకంలో నా తండ్రి వారి పట్ల దానిని జరిగిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 20ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకుని ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను” అని చెప్పారు.
కరుణలేని ఒక సేవకుని గురించిన ఉపమానం
21అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా సహోదరుడు నాకు విరోధంగా తప్పు చేస్తే నేను ఎన్ని సార్లు అతన్ని క్షమించాలి, ఏడుసార్లు క్షమించాలా?” అని అడిగాడు.
22అందుకు యేసు అతనితో, “ఏడు సార్లే కాదు కాని డెబ్బై ఏడుసార్లు వరకు క్షమించాలి అని నీతో చెప్తున్నాను.
23“పరలోక రాజ్యం తన దాసుల లెక్కలను సరిచూడ కోరిన ఒక రాజును పోలి ఉంది. 24లెక్కలను సరిచూడ మొదలుపెట్టినప్పుడు, పదివేల తలాంతుల బంగారం అప్పు ఉన్నవాడు తీసుకురాబడ్డాడు. 25వాడు అప్పు తీర్చలేక పోయినందుకు ఆ రాజు వాని దగ్గర ఏమిలేదని, వాని భార్యను, వాని పిల్లలను వానికి కలిగినవన్ని అమ్మి తన బాకీని తీర్చాలని ఆదేశించాడు.
26“అందుకు ఆ పనివాడు ఆ రాజు పాదాల ముందు సాగిలపడి, ‘నా విషయంలో కొంచెం ఓపిక పట్టండి, నేను బాకీ అంతా తీర్చేస్తాను’ అని బ్రతిమాలాడు. 27కాబట్టి రాజు వాని మీద జాలిపడి, వాని బాకీ అంతా క్షమించి, వానిని విడిచిపెట్టాడు.
28“కానీ వాడు బయటకు వెళ్లి తనకు వంద వెండి దేనారాలు బాకీ ఉన్న తన తోటి పనివానిలో ఒకనిని చూసి, ‘నీవు తీసుకున్న బాకీ తిరిగి చెల్లించు!’ అని వాని గొంతు పట్టుకున్నాడు.
29“అందుకు ఆ తోటి పనివాడు అతని పాదాల మీద పడి ‘నా విషయం కొంచం ఓపిక పట్టు, నేను బాకీ అంతా తీర్చేస్తాను’ అని బ్రతిమాలాడు.
30“అయితే అతడు దానికి ఒప్పుకోలేదు. బదులుగా, వాడు బాకీ తీర్చేవరకు వానిని జైలులో వేయించాడు. 31అదంతా చూసిన తోటి పనివారు చాలా దుఃఖపడి, వెళ్లి జరిగిన సంగతిని రాజుకు వివరించారు.
32“అప్పుడు రాజు వానిని పిలిపించి, ‘చెడ్డ దాసుడా, నీవు నన్ను బ్రతిమాలి అడిగావని నేను నీ బాకీ అంతా క్షమించాను’ కదా! 33నేను నీ పట్ల చూపిన దయను, నీవు నీ తోటి పనివాని పట్ల చూపించాలి కదా! అని వానితో అన్నాడు. 34అప్పుడు రాజు కోపంతో వాడు తన దగ్గర చేసిన బాకీ అంతా తీర్చేవరకు, చిత్రహింసలు అనుభవించడానికి జైలు అధికారికి వానిని అప్పగించాడు.
35“మీలో ప్రతి ఒకడు తన తోటి విశ్వాసిని హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మీతో అలాగే వ్యవహరిస్తాడు” అని వారితో చెప్పారు.

Istaknuto

Podijeli

Kopiraj

None

Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi

Video za మత్తయి సువార్త 18