Logótipo YouVersion
Ícone de pesquisa

మత్తయి 10

10
యేసు పన్నెండు మందిని పంపుట
1యేసు తన పన్నెండు మంది శిష్యులను దగ్గరకు పిలుచుకొని, అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి, అన్ని రకాల రోగాలను, వ్యాధులను స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చారు.
2ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు:
మొదట, పేతురు అని పిలువబడే సీమోను, అతని సహోదరుడు అంద్రెయ,
జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను,
3ఫిలిప్పు, బర్తలోమయి,
తోమా; పన్ను వసూలు చేసే మత్తయి,
అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి.
4అత్యాసక్తి కలవాడైన#10:4 అత్యాసక్తి కలవాడైన లేదా, కనానీయుడైన సీమోను సీమోను మరియు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
5యేసు ఈ పన్నెండు మందికి ఈ సూచనలు ఇచ్చి, వారిని పంపారు: “యూదేతరుల ప్రాంతాల్లోనికి కాని, సమరయ పట్టణాలకు కాని వెళ్లకండి. 6వాటి బదులు తప్పిపోయిన ఇశ్రాయేలు గొర్రెల మంద దగ్గరకు వెళ్లండి. 7మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం సమీపించింది’ అనే సందేశాన్ని ప్రకటించండి. 8రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి. కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి. దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకొన్నారు కనుక ఉచితంగా ఇవ్వండి.
9“మీ నడికట్టులో బంగారం గాని వెండి గాని రాగి గాని పెట్టుకోకండి. 10ప్రయాణం కొరకు సంచి గాని రెండో చొక్కా గాని చెప్పులు గాని చేతి కర్ర గాని తీసుకొని వెళ్లకండి, ఎందుకంటే పనివాడు ఆహారానికి అర్హులు. 11మీరు ఏ పట్టణంలో లేక ఏ గ్రామంలో ప్రవేశించినా దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకొని, వెళ్లే వరకు వారి ఇంట్లోనే బసచేయండి. 12ఒక గృహంలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. 13ఆ ఇంటికి ఆ యోగ్యత ఉంటే మీ శాంతి ఆ ఇంటి మీద నిలుస్తుంది. ఆ యోగ్యత ఆ ఇంటికి లేకపోతే మీ శాంతి మీకే తిరిగి వస్తుంది. 14ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే లేక మీ మాటలు వినకపోతే, ఆ ఇంటిని లేక ఆ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు మీ పాదాల దుమ్మును దులిపి వేయండి. 15ఎందుకంటే తీర్పు రోజున ఆ గ్రామానికి పట్టే గతికంటే సొదొమ, గొమొర్రా పట్టణాలకు పట్టిన గతే సహించ గలిగినదిగా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను.
16“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కనుక పాముల్లాగ వివేకంగా, పావురాల్లాగా కపటం లేనివారిగా ఉండండి. 17మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. 18అయితే వారికి, అలాగే యూదేతరులకు మీరు సాక్షులుగా ఉండడానికి నన్ను బట్టి మీరు అధికారుల యెదుటకు, రాజుల యెదుటకు మరియు యూదేతరుల యెదుటకు తీసుకుపోబడతారు. 19కానీ వారు మిమ్మల్ని బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో అని చింతించకండి. మీరు ఏమి చెప్పాలనేది ఆ సమయంలోనే మీకు ఇవ్వబడుతుంది; 20ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు; మీ తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు.
21“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు. 22నన్ను బట్టి మీరు ప్రతి ఒక్కరి చేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు. 23మిమ్మల్ని ఒక గ్రామంలో హింసిస్తే మరో గ్రామానికి పారిపోండి. మనుష్యకుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు గ్రామాలన్నింటికి వెళ్లడం పూర్తి చేయలేరు” అని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
24ఒక శిష్యుడు బోధకుని కంటే లేక సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. 25శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటి వారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా!
26“కనుక వారికి భయపడకండి, ఎందుకంటే దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. 27నేను మీతో చీకట్లో చెప్పేదానిని మీరు పగటివేళలో చెప్పండి; మీ చెవిలో చెప్పబడినదానిని పైకప్పులమీద నుండి ప్రకటించండి. 28శరీరాన్ని చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి. 29రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. 30అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. 31మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు; కనుక భయపడకండి.
32“ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. 33కాని ఇతరుల ముందు ఎవరు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను.
34“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని తలంచకండి. సమాధానం కాదు, నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చాను. 35ఎలాగంటే,
“ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారున్ని,
తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తెను,
తన అత్తకు వ్యతిరేకంగా కోడలును మార్చడానికి వచ్చాను.
36ఒక మనుష్యునికి అతని సొంత ఇంటివారే శత్రువులవుతారు.’#10:36 మీకా 7:6
37“తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. 38తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు. 39తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకొంటారు. నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు.
40“మిమ్మల్ని చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకొంటారు. 41ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతులు అని, నీతిమంతులను చేర్చుకొనేవారు, నీతిమంతుల ఫలం పొందుతారు. 42నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చల్లని నీళ్ళను ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”

Atualmente selecionado:

మత్తయి 10: TCV

Destaque

Partilhar

Copiar

None

Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão