YouVersion Logo
Search Icon

ఆది 14

14
అబ్రాము లోతును రక్షిస్తాడు
1అమ్రాపేలు షీనారు#14:1 అంటే బాబెలు; 9 వచనంలో కూడా యొక్క రాజుగా ఉన్న కాలంలో, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు, 2ఈ రాజులు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిము రాజైన షెమేబెరుతోను బేల (సోయరు) రాజుతోను యుద్ధం చేశారు. 3ఈ రెండవ గుంపు రాజులందరూ సిద్దీము లోయలో (మృత సముద్ర#14:3 మృత సముద్ర అంటే ఉప్పు సముద్రం లోయలో) కూడుకున్నారు. 4వారంతా పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు సేవ చేశారు, కానీ పదమూడవ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు.
5పద్నాలుగవ సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితో పొత్తు పెట్టుకున్న రాజులు కలిసి అష్తారోతు కర్నాయింలో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిములో ఎమీయులను 6హోరీయులను, శేయీరు కొండ సీమలో ఎడారి దగ్గర ఉన్న ఎల్ పారాను వరకు తరిమి ఓడించారు. 7తర్వాత అక్కడినుండి వెనుకకు తిరిగి ఎన్ మిష్పాతు అనబడిన కాదేషుకు వెళ్లి, అమాలేకీయుల భూభాగమంతా, హససోన్ తామారులో నివసిస్తున్న అమోరీయుల భూభాగమంతా జయించారు.
8అప్పుడు సిద్దీం లోయలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేల (సోయరు) రాజు తమ సైన్యాలతో, 9ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, అంటే నలుగురు రాజులు అయిదుగురు రాజులతో యుద్ధం చేశారు. 10సిద్దీము లోయ అంతా కీలుమట్టి గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోతూ ఉన్నప్పుడు, కొంతమంది వాటిలో పడిపోయారు మిగిలినవారు కొండల్లోకి పారిపోయారు. 11ఆ నలుగురు రాజులు సొదొమ గొమొర్రాల ఆస్తిపాస్తులను, భోజన పదార్థాలను అన్నిటిని దోచుకున్నారు; తర్వాత వారు వెళ్లిపోయారు. 12అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో నివసిస్తున్నాడు కాబట్టి, అతన్ని కూడా అతని ఆస్తితో పాటు తీసుకెళ్లారు.
13అయితే ఒక వ్యక్తి తప్పించుకు వచ్చి, హెబ్రీయుడైన అబ్రాముకు ఈ సంగతి తెలిపాడు. అబ్రాము ఎష్కోలు ఆనేరుల సోదరుడైన మమ్రే అనే అమోరీయుని సింధూర వృక్షాలు దగ్గర నివసిస్తున్నాడు. వీరు అబ్రాముతో ఒప్పందం చేసుకున్న వారు. 14అబ్రాము తన బంధువు బందీగా కొనిపోబడ్డాడు అని విన్నప్పుడు, తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మందిని తీసుకుని వారిని దాను వరకు తరిమాడు. 15రాత్రివేళ అబ్రాము తన మనుష్యులను గుంపులుగా విభజించి దాడి చేస్తూ, శత్రువులను ముట్టడించి, దమస్కుకు ఉత్తరాన ఉన్న హోబా వరకు వారిని తరిమాడు. 16అబ్రాము తన బంధువైన లోతును, అతని ఆస్తిని, అతని స్త్రీలను, ఇతర ప్రజలను విడిపించాడు.
17కదొర్లాయోమెరు, అతనితో పొత్తు ఉన్న రాజులను ఓడించిన తర్వాత, రాజు లోయ అనబడే షావే లోయలో సొదొమ రాజు అబ్రామును కలిశాడు.
18అప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తెచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. 19అతడు అబ్రామును,
“భూమ్యాకాశాల సృష్టికర్త,
సర్వోన్నతుడైన దేవుడు అబ్రామును దీవించును గాక,
20నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన
సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగును గాక”
అంటూ ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు.
21సొదొమ రాజు, “చెరగా తెచ్చిన ప్రజలను నాకు ఇవ్వండి, వస్తువులను మీ కోసం పెట్టుకోండి” అని అబ్రాముతో అన్నాడు.
22అయితే అబ్రాము సొదొమ రాజుతో, “చేతులెత్తి సర్వోన్నతుడైన దేవుడు, భూమ్యాకాశాల సృష్టికర్తయైన యెహోవాకు ఇలా ప్రమాణం చేశాను, 23ఒక దారం పోగైననూ, చెప్పులవారైననూ నేను ఆశించను, తద్వార నీవు, ‘నేనే అబ్రామును ధనికుడయ్యేలా చేశాను’ అని చెప్పకుండ ఉంటావు. 24నేను దేన్ని అంగీకరించను కాని నా మనుష్యులు తిన్నది, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే వారికి వారి వాటాను తీసుకోనివ్వు” అని చెప్పాడు.

Currently Selected:

ఆది 14: TSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in