మత్తయి సువార్త 2

2
క్రీస్తును దర్శించిన జ్ఞానులు
1హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు తూర్పుదిక్కు నుండి జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు. 2వారు, “యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాం” అని చెప్పారు.
3హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడును అతనితో పాటు యెరూషలేము వారంతా కలవరపడ్డారు. 4హేరోదు రాజు ప్రజల ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులనందరిని పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు. 5అందుకు వారు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని చెప్పారు, “ఎందుకంటే ప్రవక్త ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంది:
6“ ‘యూదయ దేశంలోని బేత్లెహేమా,
నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు;
ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి
నీలో నుండి వస్తాడు.’#2:6 మీకా 5:2,4
7అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయమేదో వారిని అడిగి తెలుసుకున్నాడు. 8తర్వాత ఆయన వారితో, “మీరు వెళ్లి ఆ శిశువు కోసం జాగ్రత్తగా వెదకి మీరు అతన్ని కనుగొనగానే నాకు చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పి బేత్లెహేముకు పంపించాడు.
9వారు రాజు మాటలు విని బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం వారి ముందు వెళ్తూ ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి ఆగింది. 10వారు ఆ నక్షత్రాన్ని చూసి చాలా ఆనందించారు. 11వారు ఆ ఇంట్లోకి వెళ్లి ఆ శిశువును తల్లియైన మరియను చూసి, వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. 12హేరోదు రాజు దగ్గరకు తిరిగి వెళ్లకూడదని కలలో వారు హెచ్చరించబడి వేరే దారిలో తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.
ఈజిప్టుకు పారిపోవుట
13వారు వెళ్లిన తర్వాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “ఈ శిశువును చంపాలని హేరోదు రాజు వెదుకుతున్నాడు కాబట్టి నీవు శిశువును తల్లిని తీసుకుని ఈజిప్టుకు పారిపోయి నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండు” అని చెప్పాడు.
14కాబట్టి యోసేపు లేచి ఆ రాత్రి సమయంలోనే శిశువును తల్లియైన మరియను తీసుకుని ఈజిప్టుకు బయలుదేరి వెళ్లి, 15హేరోదు మరణించే వరకు అక్కడే ఉన్నాడు. “ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను”#2:15 హోషేయ 11:1 అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఇలా నెరవేరాయి.
16ఆ జ్ఞానులు తనను మోసగించారని గ్రహించిన హేరోదు చాలా కోపంతో జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములోను దాని పరిసర ప్రాంతాల్లోను రెండు సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయస్సుగల మగ పిల్లలందరిని చంపుమని ఆదేశించాడు. 17యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరాయి:
18“రామాలో ఏడ్పు
గొప్ప రోదన వినబడుతుంది,
రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ
ఇక వారు లేరని,
ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”#2:18 యిర్మీయా 31:15
నజరేతుకు తిరిగి వచ్చుట
19హేరోదు చనిపోయిన తర్వాత, ఈజిప్టులో ఉన్న యోసేపుకు ప్రభువు దూత కలలో కనపడి 20అతనితో, “బాలుని ప్రాణం తీయాలని చూసినవారు చనిపోయారు. కాబట్టి నీవు లేచి బాలున్ని అతని తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు” అని చెప్పాడు.
21కాబట్టి యోసేపు లేచి బాలున్ని అతని తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్లాడు. 22అయితే అర్కెలా తన తండ్రియైన హేరోదు స్థానంలో యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడని అతడు విని అక్కడికి వెళ్లడానికి భయపడ్డాడు. కలలో దేవుని హెచ్చరిక పొంది గలిలయ ప్రాంతానికి వెళ్లి, 23నజరేతు అనే ఊరిలో నివసించాడు. ఆయన నజరేయుడు అని పిలువబడతాడని ప్రవక్తల ద్వారా చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.

Marker

Del

Kopier

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på