లూకా 24
24
యేసు క్రీస్తు పునరుత్థానం
మత్తయి 28:1-6; మార్కు 16:1-8; యోహా 20:1-17
1ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు. 2సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్ళారు. 3కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు.
4అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు. 5వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు? 6ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు 7మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి” అన్నారు.
8అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. 9వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు.
10ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో ఉన్న యితర స్త్రీలూ. 11అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు. 12అయితే పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
పునరుత్థాన క్రీస్తు పరిచర్య
13ఆ రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్తున్నారు. 14జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. 15అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. 16అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది.
17ఆయన, “మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?” అని వారిని అడిగాడు. దాంతో వారు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు. 18వారిలో క్లెయొపా అనేవాడు, “యెరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా” అన్నాడు.
19ఆయన, “ఏ విషయాలు?” అని అడిగాడు. అప్పుడు వారు, “నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు. 20మన ముఖ్య యాజకులూ అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి, ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా? 21ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.
22అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు. 23కొందరు దేవదూతలు తమకు కనబడి, ‘ఆయన బతికే ఉన్నాడు’ అని చెప్పారు అని మాకు తెలిపినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. 24మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు.
25అందుకాయన, “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, 26క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని వారితో అన్నాడు. 27ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వారికి తెలియజేశాడు.
28ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది. 29దాంతో వారు, “పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు” అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంట్లోకి వెళ్ళాడు.
30ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు. 31అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు. 32అప్పుడు వారు, “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్టు అనిపించ లేదూ” అని చెప్పుకున్నారు.
33అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని 34“ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు” అని చెప్పుకుంటున్నారు. వారది విని 35దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు.
36వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 37అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. 38అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? 39నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. 40అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.
41అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. 42వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. 44తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.
మహాభినియామకం
మత్తయి 28:18-20; మార్కు 16:15-18; యోహా 1:8
46 “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.
క్రీస్తు ఆరోహణం
మార్కు 16:19, 20; అపొ.కా. 1:9, 11
49 “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. 50ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. 51అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. 52వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.
Селектирано:
లూకా 24: IRVTel
Нагласи
Сподели
Копирај
Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.