Лого на YouVersion
Икона за пребарување

లూకా 21

21
వితంతువు వేసిన కానుక. దేవునికి ఇవ్వడం గురించి యేసు అభిప్రాయం
మార్కు 12:41, 44
1హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు. 2ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు. 3అప్పుడాయన “ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను. 4వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది” అని వారితో చెప్పాడు.
ఒలీవ కొండ ప్రసంగం
మత్తయి 24-25; మార్కు 13
5దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. 6అప్పుడు ఆయన, “ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది” అన్నాడు. 7అప్పుడు వారు, “బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని ఆయనను అడిగారు.
భావి మానవ చరిత్ర
మత్తయి 24:3-14
8ఆయన, “మీరు మోసానికి గురి కాకుండా చూసుకోండి. చాలా మంది నా పేర వచ్చి, ‘నేనే ఆయనను’ అంటారు. ‘ఆ కాలం దగ్గర పడింది’ అంటారు. మీరు వారిని అనుసరించవద్దు. 9మీరు యుద్ధాలను గూర్చీ విప్లవాలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు. ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు. 10ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది. 11కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి.
12 ఇవన్నీ జరగడానికి ముందు వారు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు. నా నామం కోసం మిమ్మల్ని రాజుల ఎదుటికీ అధికారుల ఎదుటికీ తీసుకువెళ్ళి, సమాజ మందిరాలకీ చెరసాలలకూ అప్పగిస్తారు. 13దీని వలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది. 14కనుక మేము ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో నిశ్చయం చేసుకోండి. 15మీ విరోధులు ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ, నోటిమాటలనూ మీకిస్తాను. 16తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, బంధువులూ, స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు. వారు మీలో కొంతమందిని చంపిస్తారు. 17నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. 18కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. 19మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు.
యెరూషలేము వినాశనం
20 యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి. 21అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు. 22ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. 23ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది. 24వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.
మహా తేజస్సులో ప్రభువు రాక
మత్తయి 24:29-31
25 “ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు. 26ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు. 27అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు. 28ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది” అన్నాడు.
అంజూరు చెట్టు ఉపమానం
మత్తయి 24:32, 33; మార్కు 13:28, 29
29తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి. 30అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా! 31అదే విధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి. 32ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు కచ్చితంగా చెబుతున్నాను. 33ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.
ప్రభువు రాక, హెచ్చరికలు
మత్తయి 24:34-51; మార్కు 13:30-37
34 “తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి. 35ఆ రోజు లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది. 36కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి” అని చెప్పాడు.
37ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు. 38ప్రజలంతా పొద్దున్నే దేవాలయంలో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు.

Селектирано:

లూకా 21: IRVTel

Нагласи

Сподели

Копирај

None

Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се