Лого на YouVersion
Икона за пребарување

యోహాను 7

7
పర్ణశాలల పండగకు యేసు పయనం
లూకా 9:51-62
1ఆ తరువాత యేసు గలిలయకు వెళ్ళి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదయలో యూదులు ఆయనను చంపాలని వెతుకుతూ ఉండటంతో అక్కడ సంచరించడానికి ఆయన ఇష్టపడలేదు. 2ఇంతలో యూదుల పర్ణశాలల పండగ సమీపించింది.
3అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో, “నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే ఈ స్థలం వదిలి యూదయకు వెళ్ళు. 4అందరూ మెచ్చుకోవాలని చూసేవాడు తన పనులు రహస్యంగా చేయడు. నువ్వు నిజంగా ఈ కార్యాలు చేస్తున్నట్టయితే లోకమంతటికీ తెలిసేలా చెయ్యి. నిన్ను నువ్వే చూపించుకో” అన్నారు.
5ఆయన తమ్ముళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచలేదు. 6అప్పుడు యేసు, “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. 7లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది. 8మీరు పండక్కి వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండక్కి ఇప్పుడే వెళ్ళను” అని వారితో చెప్పాడు. 9వారికి ఇలా చెప్పి ఆయన గలిలయలో ఉండిపోయాడు.
గలిలయ నుండి అంతిమ నిష్క్రమణం
10కానీ తన తమ్ముళ్ళు పండక్కి వెళ్ళిన తరువాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా వెళ్ళాడు. 11ఆ ఉత్సవంలో యూదులు ‘ఆయన ఎక్కడ ఉన్నాడు’ అంటూ ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. 12ప్రజల మధ్య ఆయనను గురించి పెద్ద వాదం ప్రారంభమైంది. కొందరేమో, “ఆయన మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు. ఆయన మోసగాడు” అన్నారు. 13అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బయటకు మాట్లాడలేదు.
పర్ణశాలల పండగలో యేసు
14పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు. 15ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి, “చదువూ సంధ్యా లేని వాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది” అని చెప్పుకున్నారు.
16దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే. 17దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు. 18తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు. 19మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా! కానీ మీలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించరు. మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు?” అన్నాడు.
20అందుకు ఆ ప్రజలు, “నీకు దయ్యం పట్టింది. నిన్ను చంపాలని ఎవరు కోరుకుంటారు?” అన్నారు. 21యేసు వారితో, “నేనొక కార్యం చేశాను. దానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు. 22మోషే మీకు సున్నతి అనే ఆచారాన్ని నియమించాడు. ఈ ఆచారం మోషే వల్ల కలిగింది కాదు. ఇది పూర్వీకుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినాన మీరు సున్నతి కార్యక్రమం చేస్తున్నారు. 23విశ్రాంతి దినాన సున్నతి పొందినా మోషే ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించినట్టు కాదు గదా! అలాంటప్పుడు నేను విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే నా మీద ఎందుకు కోపం చూపుతున్నారు? 24బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి” అన్నాడు.
25యెరూషలేము వారిలో కొందరు, “వారు చంపాలని వెదకుతున్నవాడు ఈయన కాదా? 26చూడండి, ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నా ఈయనను ఏమీ అనరు. ఈయనే క్రీస్తని అధికారులకి తెలిసి పోయిందా ఏమిటి? 27అయినా ఈయన ఎక్కడి వాడో మనకు తెలుసు. క్రీస్తు వచ్చినప్పుడైతే ఆయన ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు” అని చెప్పుకున్నారు.
28కాబట్టి యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ, “మీకు నేను తెలుసు. నేను ఎక్కడ నుండి వచ్చానో కూడా మీకు తెలుసు. నేను నా స్వంతంగా ఏమీ రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు. 29నేను ఆయన దగ్గర నుండి వచ్చాను. ఆయనే నన్ను పంపాడు కాబట్టి నాకు ఆయన తెలుసు” అని గొంతెత్తి చెప్పాడు. 30దానికి వారు ఆయనను పట్టుకోడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేకపోయారు. 31ప్రజల్లో అనేక మంది ఆయనలో విశ్వాసముంచారు. “క్రీస్తు వచ్చినప్పుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడా ఏమిటి” అని వారు చెప్పుకున్నారు. 32ప్రజలు ఆయనను గురించి ఇలా మాట్లాడుకోవడం పరిసయ్యుల దృష్టికి వెళ్ళింది. అప్పుడు ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ ఆయనను పట్టుకోడానికి సైనికులను పంపించారు.
33యేసు మాట్లాడుతూ, “నేను ఇంకా కొంత కాలం మాత్రమే మీతో ఉంటాను. ఆ తరువాత నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్ళిపోతాను. 34అప్పుడు మీరు నన్ను వెతుకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు” అన్నాడు. 35దానికి యూదులు, “మనకు కనిపించకుండా ఈయన ఎక్కడికి వెళ్తాడు? గ్రీసు దేశం వెళ్ళి అక్కడ చెదరి ఉన్న యూదులకు, గ్రీకు వారికి ఉపదేశం చేస్తాడా? 36‘నన్ను వెతుకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు’ అన్న మాటలకి అర్థం ఏమిటో” అంటూ తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు.
పరిశుద్ధాత్మ గురించిన గొప్ప ప్రవచనం
అపొ.కా. 2:2-4; యోహా 4:14
37ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి, “ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి. 38లేఖనాలు చెబుతున్నాయి, నాపై విశ్వాసముంచే వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పాడు. 39తనపై నమ్మకం ఉంచేవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు అప్పటికి తన మహిమా స్థితి పొందలేదు కనుక దేవుని ఆత్మ దిగి రావడం జరగలేదు.
ప్రజల్లో భేదాభిప్రాయాలు
40ప్రజల్లో కొందరు ఆ మాట విని, “ఈయన నిజంగా ప్రవక్తే” అన్నారు. 41మరికొందరు, “ఈయన క్రీస్తే” అన్నారు. దానికి జవాబుగా ఇంకా కొందరు, “ఏమిటీ, క్రీస్తు గలిలయ నుండి వస్తాడా? 42క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరు బేత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ లేఖనాల్లో రాసి లేదా?” అన్నారు. 43ఈ విధంగా ప్రజల్లో ఆయనను గురించి భేదాభిప్రాయం కలిగింది. 44వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు కానీ ఎవరూ ఆయనను పట్టుకోలేదు.
45పరిసయ్యులు పంపిన సైనికులు తిరిగి వచ్చారు. ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ, “మీరు ఆయనను ఎందుకు తీసుకురాలేదు?” అని అడిగారు. 46దానికి ఆ సైనికులు, “ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు. 47దానికి పరిసయ్యులు, “మీరు కూడా మోసపోయారా? 48అధికారుల్లో గానీ పరిసయ్యుల్లో గానీ ఎవరైనా ఆయనను నమ్మారా? 49ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజల పైన శాపం ఉంది” అని సైనికులతో అన్నారు. 50అంతకు ముందు యేసు దగ్గరికి వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు, 51“ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా అతడేం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీరుస్తుందా?” అన్నాడు. 52దానికి వారు, “నువ్వు కూడా గలిలయుడవేనా? ఆలోచించు, గలిలయలో ఎలాంటి ప్రవక్తా పుట్టడు” అన్నారు. 53ఇక ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.

Селектирано:

యోహాను 7: IRVTel

Нагласи

Сподели

Копирај

None

Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се