Лого на YouVersion
Икона за пребарување

యోహాను 2

2
కానా పెండ్లి – మొదటి అద్భుతకార్యం
1మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. 2ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు.
3విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. 4యేసు ఆమెతో, “అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. 5ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది. 6యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి. 7యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. 8అప్పుడు ఆయన, “ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు.
9ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో, 10“అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు.
11యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు. 12ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ వారు కొన్ని రోజులు ఉన్నారు.
మొదటి పస్కా
యోహా 6:4-11:55
మొదటి ఆలయ శుద్ధి
మత్తయి 21:12, 13; మార్కు 11:15-17; లూకా 19:45, 46
13యూదుల పండగ పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు. 14అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు. 15ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు. 16పావురాలు అమ్మేవారితో ఆయన, “వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి” అన్నాడు. 17ఆయన శిష్యులు, “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది” అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు.
18అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు. 19దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు. 20అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు. 21అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి. 22ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.
23ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు. 24అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు. 25ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.

Селектирано:

యోహాను 2: IRVTel

Нагласи

Сподели

Копирај

None

Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се