ఆదికాండము 7

7
1యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి. 2పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును 3ఆకాశపక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము; 4ఎందు కనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. 5తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.
6ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు. 7అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించు కొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. 8-9దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను, మగది ఆడుది జతజతలుగా ఓడలో నున్న నోవహు నొద్దకు చేరెను. 10ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను. 11నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవనెల పదియేడవదినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 12నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను. 13ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. 14వీరే కాదు; ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను. 15జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను. 16ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. 17ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను. 18జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను. 19ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. 20పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను. 21అప్పుడు పక్షులేమి పశువులేమి మృగము లేమి భూమిమీద ప్రాకుపురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. 22పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పోయెను. 23నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను. 24నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요