మత్తయి 9

9
యేసు పక్షవాతంగల వానిని క్షమించి స్వస్థపరచుట
1యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకొన్నారు. 2కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “కుమారుడా, ధైర్యం తెచ్చుకో, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు.
3అప్పుడు కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని చెప్పుకొన్నారు.
4యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో, “మీ హృదయాల్లో ఈ దురాలోచనలు ఎందుకు రానిస్తున్నారు? 5వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేక ‘లేచి నడువు’ అని చెప్పడమా? 6అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు, 7అతడు లేచి ఇంటికి వెళ్లాడు. 8జనసమూహం అది చూసి, వారు భయంతో నిండుకొని, మానవునికి ఇలాంటి అధికారాన్ని ఇచ్చిన దేవుని స్తుతించారు.
మత్తయిని పిలుచుట
9యేసు అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒక వ్యక్తిని చూసి, “నన్ను వెంబడించు” అని అతనితో అన్నారు. మత్తయి లేచి ఆయనను వెంబడించాడు.
10యేసు మత్తయి ఇంట్లో భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో పాటు కలిసి భోజనం చేశారు. 11ఇది చూసిన పరిసయ్యులు, “మీ బోధకుడు పన్ను వసూలు చేసేవారితో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు.
12అది విని యేసు, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. 13అందుకే మీరు వెళ్లి, ‘నేను కనికరాన్నే కోరుతున్నాను కాని, బలిని కాదు’ అంటే అర్థమేమిటో తెలుసుకోండి:#9:13 హోషేయ 6:6 ఎందుకంటే నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు.
యేసు ఉపవాసం గురించి ప్రశ్నించుట
14అప్పుడు యోహాను శిష్యులు వచ్చి, “మేము, పరిసయ్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నాం, కాని నీ శిష్యులు ఉపవాసం ఉండడం లేదు ఎందుకు?” అని ఆయనను అడిగారు.
15అందుకు యేసు, “పెండ్లికుమారుడు తమతో ఉన్నప్పుడు అతని అతిథులు ఎందుకు దుఃఖిస్తారు? పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు” అని జవాబిచ్చారు.
16“ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, ఎందుకంటే ఆ బట్ట, పాత బట్ట నుండి విడిపోయి చినుగును మరి ఎక్కువ చేస్తుంది. 17అలాగే ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు; అలా చేస్తే క్రొత్త ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. కనుక క్రొత్త ద్రాక్షరసాన్ని క్రొత్త తిత్తులలోనే పోయాలి అప్పుడు ఆ రెండు భద్రంగా ఉంటాయి” అని చెప్పారు.
యేసు చనిపోయిన బాలికను లేపుట మరియు రక్తస్రావ రోగిని స్వస్థపరచుట
18ఆయన ఈ సంగతులు వారితో చెప్తున్నప్పుడు, సమాజమందిరపు అధికారి ఒకరు వచ్చి ఆయన ముందు మోకరించి, “నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. కానీ నీవు వచ్చి ఆమె మీద చెయ్యి పెడితే, ఆమె బ్రతుకుతుంది” అన్నాడు. 19యేసు లేచి అతనితో వెళ్లారు, ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్లారు.
20అప్పుడే, పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును తాకింది. 21ఆమె తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నేను పూర్తిగా స్వస్థపడతాను” అనుకొంది.
22యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “కుమారీ, ధైర్యం తెచ్చుకో! నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు. ఆ సమయంలోనే ఆ స్త్రీ స్వస్థత పొందుకొంది.
23యేసు ఆ సమాజమందిరపు అధికారి ఇంట్లోకి వెళ్లినప్పుడు, అక్కడ పిల్లన గ్రోవులు వాయిస్తూ గోల చేస్తున్న గుంపును చూసి, 24ఆయన వారితో, “బయటికి వెళ్లండి! అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు. అందుకు వారు ఆయనను చూసి హేళనగా నవ్వారు. 25ఆ గుంపును బయటకు పంపివేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్లి ఆ అమ్మాయి చేతిని పట్టుకోగానే ఆ అమ్మాయి లేచి నిలబడింది. 26ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకిపోయింది.
యేసు మూగవానిని గ్రుడ్డివానిని స్వస్థపరచుట
27అక్కడి నుండి యేసు వెళ్తున్నప్పుడు ఇద్దరు గ్రుడ్డివారు “దావీదు కుమారుడా! మమ్మల్ని కరుణించు” అని కేకలువేస్తూ ఆయనను వెంబడించారు.
28ఆయన ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఆ గ్రుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చారు. యేసు వారితో, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని అన్నారు.
వారు “అవును, ప్రభూ!” అన్నారు.
29అప్పుడు ఆయన వారి కళ్ళను ముట్టి, “మీ విశ్వాసం చొప్పున మీకు జరుగును గాక” అన్నారు. 30వారికి తిరిగీ చూపు వచ్చేసింది. యేసు వారితో, “ఈ సంగతి ఎవ్వరికి తెలియనివ్వకండి” అని తీవ్రంగా హెచ్చరించారు. 31కానీ వారు బయటకు వెళ్లి, ఆయన గురించి ఆ ప్రాంతం అంతా చాటించారు.
32వారు బయటకు వెళ్లేటప్పుడు, దయ్యం పట్టి మూగవానిగా ఉన్న ఒకనిని కొందరు ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. 33ఆ దయ్యం వెళ్లగొట్టబడిన తర్వాత ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడి, “ఇలాంటిది ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడు చూడలేదు” అని చెప్పుకొన్నారు.
34కాని పరిసయ్యులు, “దయ్యాల అధిపతి సహాయంతో ఇతడు దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.
పనివారు కొందరే
35మరియు యేసు అన్ని పట్టణాలు, గ్రామాల గుండా వెళ్తూ వారి సమాజమందిరాలలో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రతి వ్యాధిని, రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు. 36ఆయన జనసమూహాలను చూసినప్పుడు వారు కాపరిలేని గొర్రెలవలె పీడించబడి నిస్సహాయులుగా ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. 37అప్పుడు ఆయన తన శిష్యులతో, “కోత సమృద్ధిగా ఉంది కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. 38పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.

ハイライト

シェア

コピー

None

すべてのデバイスで、ハイライト箇所を保存したいですか? サインアップまたはサインインしてください。