ఆది 6

6
మానవ దుష్టత్వం
1మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు 2దైవ కుమారులు#6:2 పరలోక ఆత్మలు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. 3యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు.
4దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.
5మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. 6తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.
7కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.
నోవహు
8అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు.
9నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు. 10షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు.
11దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. 12దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు.
13దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను. 14కోనిఫర్ కలపతో నీ కోసం ఒక #6:14 పెద్ద పెట్టె ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి. 15నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.
16ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దాన్ని చెయ్యాలి. 17విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి.
18కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు. 19నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి.
20అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి. 21తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి” అని చెప్పాడు. 22దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.

वर्तमान में चयनित:

ఆది 6: IRVTel

हाइलाइट

शेयर

कॉपी

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in