ఆది 26
26
గెరారులో ఇస్సాకు
1అబ్రాహాము రోజుల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా ఆ దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు.
2అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. “నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు. నేను నీతో చెప్పే దేశంలోనే నివసించు. 3ప్రస్తుతం నువ్వున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను.
4నీ వంశస్థులను ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను. 5ఎందుకంటే నీ తండ్రి అబ్రాహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలనూ, శాసనాలనూ, నా చట్టాలనూ, నా నియమాలనూ పాటించాడు” అని అతనికి చెప్పాడు.
6కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. 7అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు “ఆమె నా చెల్లి” అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు. 8అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది.
9అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి “చూడు, ఆమె కచ్చితంగా నీ భార్యే, ఆమె నా చెల్లి అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. దానికి ఇస్సాకు “ఆమెను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపుతారేమోనని అనుకున్నాను” అన్నాడు. 10అందుకు అబీమెలెకు “నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకునే వాడే కదా! మాకు ఆ పాతకం చుట్టుకునేదే కదా!” అన్నాడు. 11కాబట్టి అబీమెలెకు తన ప్రజలందరికీ “ఈ వ్యక్తిని గానీ ఇతని భార్యను గానీ ముట్టుకునే వాడు కచ్చితంగా మరణశిక్ష పొందుతాడు” అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు.
12ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేసాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల నూరంతలు అధిక పంటను కోయగలిగాడు. 13కాబట్టి ఇస్సాకు ఆస్తిపరుడయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు. 14అతనికి అనేక గొర్రెలూ పశువులూ సమకూడాయి. అనేకమంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ఫిలిష్తీయులు అతనిపై అసూయపడ్డారు.
15అతని తండ్రి అయిన అబ్రాహాము రోజుల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మట్టి వేసి పూడ్చివేశారు. 16అప్పుడు అబీమెలెకు ఇస్సాకుతో “నువ్వు మాకంటే బలవంతుడివి. కాబట్టి ఈ ప్రాంతం విడిచి మాకు దూరంగా వెళ్లి పో” అన్నాడు. 17కాబట్టి ఇస్సాకు అక్కడనుండి తరలి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు.
18అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ళ బావులను తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రాహాము మరణం తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రాహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు.
19ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ళ బావి లభ్యమైంది. 20అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో “ఈ నీళ్ళు మావే” అంటూ పోట్లాడారు. ఈ విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు కనుక ఇస్సాకు ఆ బావికి “#26:20 జగడంఏశెకు” అని పేరు పెట్టాడు.
21తరువాత వాళ్ళు మరో బావి తవ్వారు. దాని కోసం కూడా అక్కడి వాళ్ళు పోట్లాడారు. కాబట్టి ఇస్సాకు దానికి “#26:21 వైరంశిత్నా” అనే పేరు పెట్టాడు. 22అతడు అక్కడ్నించి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు. దానికోసం ఎలాంటి గొడవా జరగలేదు. కాబట్టి ఇస్సాకు “యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు. కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం” అంటూ ఆ స్థలానికి #26:22 విశాలమైనరహబోతు అనే పేరు పెట్టాడు.
23అప్పుడు అక్కడనుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు. 24ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి భయపడవద్దు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను.” 25ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరుమీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు.
ఇస్సాకు, అబీమెలెకు ఒప్పందం
26ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతునూ తన సైన్యాధిపతి అయిన ఫీకోలునూ వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. 27వారితో ఇస్సాకు “మీరు నామీద కక్ష కట్టి మీ దగ్గరనుండి పంపివేశారు. ఇప్పుడు దేనికోసం నా దగ్గరికి వచ్చారు?” అని వారిని అడిగాడు.
28అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు. “యెహోవా కచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని అంటే నీకూ మాకూ మధ్య నిబంధన ఉండాలని కోరుతున్నాం. 29మేము నీకు ఎలాంటి హానీ చేయలేదు. నీకెలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్యనుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు.”
30కాబట్టి ఇస్సాకు వాళ్ళకు విందు చేశాడు. వాళ్ళు చక్కగా తిని తాగారు. 31పెందలకడనే వాళ్ళు లేచి ఒకరితో మరొకరు నిబంధన చేసుకున్నారు. తరువాత ఇస్సాకు వాళ్ళను శాంతియుతంగా సాగనంపాడు.
32అదే రోజు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన ఒక బావిని గూర్చి అతనికి తెలియజేశారు. తాము తవ్విన బావిలో నీళ్ళు పడ్డాయని చెప్పారు. 33ఆ బావికి ఇస్సాకు “#26:33 శపథంషీబా” అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకూ ఆ ఊరి పేరు బెయేర్షెబాయే.
ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకోవడం
34ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో హిత్తీయుడైన బేయేరీ కూతురు యహూదీతునూ, హిత్తీయుడైన ఏలోను కూతురు బాశెమతునూ పెళ్ళి చేసుకున్నాడు. 35వీరు ఇస్సాకు రిబ్కాలకు ఎంతో మనోవేదన కలిగించారు.
वर्तमान में चयनित:
ఆది 26: IRVTel
हाइलाइट
शेयर
कॉपी
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.