YouVersion Logo
Search Icon

లూకా 23

23
పిలాతు ఎదుట యేసు
మత్తయి 27:2, 11-14; మార్కు 15:1-5; యోహా 18:28-38
1అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. 2“ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము” అని ఆయన మీద నేరారోపణ చేశారు. 3అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి ఆయన, “నువ్వే అంటున్నావు కదా” అన్నాడు.
4పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ, “ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు,” అన్నాడు. 5అయితే వారు, “ఇతడు గలిలయ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు” అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు.
హేరోదు ఎదుట యేసు
6పిలాతు ఈ మాట విని, “ఇతడు గలిలయ ప్రాంతం వాడా?” అని అడిగాడు. 7ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయనను హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు.
8హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయనను చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు. 9హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు.
10ముఖ్య యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. 11హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. 12అంతకు ముందు హేరోదూ, పిలాతూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ రోజు వారిద్దరూ స్నేహితులయ్యారు.
మళ్ళీ పిలాతు ఎదుటికి, బరబ్బా విడుదల, యేసుకు మరణ శిక్ష
మత్తయి 27:15-26; మార్కు 15:6-15; యోహా 18:39, 40
13అప్పుడు పిలాతు ముఖ్య యాజకులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించాడు. 14“ప్రజలు తిరగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా. మీ ముందే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. కానీ మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు. 15హేరోదుకు కూడా ఏ దోషమూ కనిపించలేదు. హేరోదు ఇతణ్ణి నా దగ్గరకే తిరిగి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదు. 16అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు.
17పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక. 18అయితే వారంతా, “వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి” అని ఒక్కపెట్టున కేకలు వేశారు. 19బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నాడు.
20పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు. 21కాని వారంతా, “వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి” అని మరింతగా కేకలు వేశారు. 22మూడవ సారి అతడు, “ఎందుకు? ఇతడేమి దుర్మార్గం చేశాడు? ఇతనిలో మరణ శిక్షకు తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి వదిలేస్తాను” అన్నాడు.
23కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి, “వీణ్ణి సిలువ వేయండి” అని అరిచారు. చివరికి వారి కేకలే గెలిచాయి. 24వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు. 25వారు కోరినట్టే తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నవాణ్ణి విడుదల చేసి, యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు.
26వారాయన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరి నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని, యేసు వెంటే సిలువ మోయడానికి దాన్ని అతని మీద పెట్టారు.
సిలువ
మత్తయి 27:33-38; మార్కు 15:22-28; యోహా 19:17-19
27పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.
28యేసు వారివైపు తిరిగి, “యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.
29 వినండి, ‘గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం’ అని చెప్పే రోజులు వస్తున్నాయి.
30 అప్పుడు ‘మా మీద పడండి’ అని పర్వతాలతో, ‘మమ్మల్ని కప్పివేయండి’ అని కొండలతో ప్రజలు చెప్పడం మొదలుపెడతారు.
31 చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో” అని చెప్పాడు.
32ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు. 33వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.
34అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.
35ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు.
36ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ 37“నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. 38“ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు.
పరితాపం చెందిన దొంగ
మత్తయి 27:44; మార్కు 15:32
39వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు.
40కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? 41మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు.
42తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. 43అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
44అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది. 45సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.
యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించడం
మత్తయి 27:50; మార్కు 15:37; యోహా 19:30
46అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు.
47శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. 48ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. 49ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.
భూస్థాపన
మత్తయి 27:57-61; మార్కు 15:42, 47; యోహా 19:38, 42
50యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు. 51మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 52అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు.
53తరువాత ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్న నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు.
54అది సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది. 55అప్పుడు గలిలయ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి 56తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.

Currently Selected:

లూకా 23: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in