YouVersion Logo
Search Icon

ఆది 18

18
అబ్రాహాము, శారాలకు వాగ్దానం
1మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. 2అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.
3“ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి. 4నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. 5మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు.
6అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా #18:6 పాత అనువాదంలో మూడు మానికలు అని ఉంది.21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు. 7తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు. 8తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
9వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు. 10అప్పుడు #18:10 యెహోవాఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
11అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది. 12శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.
13అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది? 14యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. 15అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు.
16అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు. 17కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు. 18అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను? 19అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.”
20అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక 21నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”
అబ్రాహాము సొదొమకోసం విన్నపం చెయ్యడం
22ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. 23అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
24ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?” 26దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు.
27అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 28యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు.
29అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు. 30అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 31అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు.
32చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 33అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.

Currently Selected:

ఆది 18: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in