YouVersion Logo
Search Icon

మార్కు 6:17-28

మార్కు 6:17-28 IRVTEL

ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. ఎందుకంటే యోహాను హేరోదుతో, “నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం” అని హెచ్చరించాడు. అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది కానీ అలా చెయ్యలేకపోయింది. ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు. ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు. హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు. “నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!” అని ప్రమాణం చేశాడు. ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. ఆమె, “బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో” అని చెప్పింది. వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, “బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే” అని అడిగింది. రాజుకు చాలా దుఃఖం కలిగింది గాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు. అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.