YouVersion Logo
Search Icon

జెకర్యా 8

8
యెరూషలేముకు పూర్వస్థితి దేవుడు అనుగ్రహిస్తాడు
1సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. 2సేనల ప్రభువు యెహోవా ఆజ్ఞ ఇచ్చేదేమిటంటే “తీవ్రమైన ఆసక్తితో నేను సీయోను విషయంలో రోషం వహించాను. రౌద్రుడినై దాని విషయం నేను పట్టించుకున్నాను.”
3యెహోవా చెప్పేదేమిటంటే “నేను సీయోను దగ్గరికి మళ్ళీ వచ్చి, యెరూషలేములో నివాసం చేస్తాను.
సత్య పురమనీ, సేనల ప్రభువు యెహోవా కొండ అనీ, పరిశుద్ధ పర్వతమనీ దానికి పేర్లు పెడతారు.
4సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేదేమంటే వృద్ధాప్యం వల్ల కర్ర పట్టుకుని, వృద్ధ స్త్రీపురుషులూ ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు.
5ఆ పట్టణం వీధులు ఆటలాడుకునే బాలబాలికలతో నిండి ఉంటాయి.
6సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే ఆ దినాల్లో మిగిలి ఉన్న ప్రజలకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుందా? ఇదే యెహోవా వాక్కు.
7సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే తూర్పు దేశంలో నుండి, పడమటి దేశంలో నుండి నేను నా ప్రజలను రప్పించి రక్షించి,
8యెరూషలేములో నివసించడానికి వారిని తీసుకు వస్తాను.
వారు నా జనులుగా ఉంటారు., నేను వారికి దేవుడనై ఉంటాను.
ఇది నీతి సత్యాలను బట్టి జరుగుతుంది.
9సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే సేనల ప్రభువు యెహోవా మందిరాన్ని కట్టడానికి దాని పునాది వేసిన దినాన ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలంలో వినే మీరంతా ధైర్యం తెచ్చుకోండి.
10ఆ దినాలకు ముందు మనుష్యులకు కూలి దొరికేది కాదు. పశువుల పనికి బాడుగ దొరికేది కాదు. తన పనిమీద పోయే వాడికి శత్రుభయం చేత నెమ్మది ఉండేది కాదు.
ఎందుకంటే ఒకరి మీదికి ఒకరిని నేను ఉసి గొలిపాను.
11అయితే పూర్వదినాల్లో నేను ఈ ప్రజల్లో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను.
12సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు కాపు కాస్తాయి. భూమి పంటలనిస్తుంది. ఆకాశం నుండి మంచు కురుస్తుంది.
ఈ ప్రజల్లో శేషించిన వారికి వీటన్నిటిని నేను ఆస్తిగా ఇస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
13యూదాప్రజలారా, ఇశ్రాయేలుప్రజలారా, మీరు అన్యప్రజల్లో ఏ విధంగా శాపానికి గురి అయి ఉన్నారో ఆలాగే మీరు ఆశీర్వాదానికి నోచుకునే వారుగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. భయపడక ధైర్యం తెచ్చుకోండి.
14సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మీ పితరులు నాకు కోపం పుట్టించగా,
దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్టు 15ఈ కాలంలో యెరూషలేముకు, యూదావారికి మేలు చేయనుద్దేశిస్తున్నాను గనక భయపడకండి.
16మీరు చేయవలసిన వేమిటంటే ప్రతివాడూ తన పొరుగు వాడితో సత్యమే మాటలాడాలి.
సత్యాన్ని బట్టి శాంతికరమైన న్యాయాన్నిబట్టి మీ గుమ్మాల్లో తీర్పు తీర్చాలి.
17తన పొరుగువాని మీద ఎవరూ చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు.
అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడకూడదు.
ఇలాటివన్నీ నాకు అసహ్యం.” ఇదే యెహోవా వాక్కు.
18సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
19“సేనల ప్రభువు యెహోవా ఆజ్ఞ ఇస్తున్నదేమిటంటే నాలుగవ నెల ఉపవాసం, ఐదవ నెల ఉపవాసం, ఏడవ నెల ఉపవాసం, పదవ నెల ఉపవాసం,
యూదా యింటివారికి సంతోషం ఉత్సాహం పుట్టించే మనోహరమైన పండగలౌతాయి.
కాబట్టి సత్యాన్ని, శాంతిసమాధానాలును ప్రేమించండి.”
20సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “జాతులు, అనేక పట్టణాల నివాసులు ఇంకా వస్తారు.
21ఒక పట్టణంవారు మరొక పట్టణం వారి దగ్గరికి వచ్చి ‘ఆలస్యం లేకుండా యెహొవాను శాంతింప జేయడానికి, సేనల ప్రభువు యెహోవాను వెదకడానికి మనం పోదాం రండి’ అని చెప్పగా వారు ‘మేము కూడా వస్తాము’ అంటారు.”
22అనేక జాతులు, బలం గల ప్రజలు యెరూషలేములో సేనల ప్రభువు యెహోవాను వెదకడానికి, యెహోవా అనుగ్రహం పొందడానికి వస్తారు.
23సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే ఆ దినాల్లో వివిధ భాషలు మాట్లాడే అన్యప్రజల్లో పదేసిమంది ఒక యూదుడి చెంగు పట్టుకుని “దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడింది గనక మేము మీతో కూడా వస్తాము” అని చెబుతారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for జెకర్యా 8