YouVersion Logo
Search Icon

జెకర్యా 14

14
యెహోవా దినం, దేవుని రాజ్య స్థాపన
1ఇదిగో వినండి. యెహోవా తీర్పు దినం వచ్చేస్తోంది. ఆ రోజు మీ నుండి దోచుకున్న సొమ్ము మీ పట్టణాల్లోనే పంచిపెడతారు. 2ఎందుకంటే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను ఇతర దేశాల ప్రజలను సమకూర్చబోతున్నాను. అప్పుడు పట్టణం శత్రువు చేజిక్కుతుంది. ఇళ్ళు దోచుకుంటారు. స్త్రీలకు మానభంగాలు జరుగుతాయి. నగరంలో సగానికి పైగా బందీలుగా వెళ్ళిపోతారు. మిగిలినవారు నాశనం కాకుండా నగరంలోనే మిగిలిపోతారు.
3అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఆ ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు. 4ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.
5కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.
6ఆ రోజున వెలుగు ఉండదు. ప్రకాశించేవన్నీ మసకబారిపోతాయి. 7అది యెహోవాకు మాత్రమే తెలిసిన రోజు. ఆ రోజు పగలూ కాదు, రాత్రీ కాదు. సాయంత్రం సమయంలో వెలుగు ఉంటుంది.
8ఆ రోజున జల ప్రవాహాలు యెరూషలేము నుండి ప్రవహిస్తాయి. వాటిలో సగం తూర్పు సముద్రంలోకి, సగం పడమర సముద్రంలోకి ప్రవహిస్తాయి. వేసవికాలంలో, చలికాలంలో కూడా అలాగే జరుగుతుంది. 9ఆ కాలంలో యెహోవా ఒక్కడే సర్వలోకానికీ రాజుగా, ప్రభువుగా ఉంటాడు. ఆయనకు పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.
10అప్పుడు దేశం యెరూషలేము దక్షిణ దిక్కున ఉన్న గెబ నుండి రిమ్మోను వరకు ఉన్న ప్రదేశంగా అవుతుంది. యెరూషలేము మెరక స్థలంలో బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు, అంటే మొదటి ద్వారం అంచు వరకు, హనన్యేలు ద్వారం నుండి రాజు ద్రాక్ష గానుగుల వరకు వ్యాపిస్తుంది. 11ప్రజలు దానిలో నివసిస్తారు. ఇకపై శాపం వారి పైకి రాదు. యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసిస్తారు.
12యెహోవా యెరూషలేముపై దండెత్తి యుద్ధం చేసిన ప్రజలపై తెగుళ్లు రప్పించి వాళ్ళను హింసిస్తాడు. ఆ ప్రజలు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్లిపోతాయి. వారి కళ్ళు వాటి కుహరాల్లోనే కుళ్లిపోతాయి. వారి నాలుకలు వారి నోళ్లలోనే కుళ్లిపోతాయి.
13ఆ రోజున యెహోవా వారి మధ్య భయంకరమైన అయోమయం పుట్టిస్తాడు. వాళ్ళంతా ఒకరికొకరు శత్రువులై ఒకరినొకరు చంపుకుంటారు. 14యూదా ప్రజలు యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న ఇతర దేశాల ప్రజలందరి నుండి బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు కొల్లసొమ్ముగా దోచుకుంటారు.
15అదే విధంగా గుర్రాల మీదా, కంచర గాడిదల మీదా, ఒంటెల మీదా, గాడిదల మీదా, మందలో ఉన్న పశువులన్నిటి మీదా తెగుళ్లు వచ్చి పడతాయి. 16యెరూషలేము మీదికి వచ్చిన ఇతర దేశాల ప్రజల్లో నాశనం కాకుండా మిగిలిన వారందరూ సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికీ, పర్ణశాల పండగ ఆచరించడానికీ ఏటేటా యెరూషలేముకు వస్తారు.
17లోకంలో ఉన్న అన్య జాతుల ప్రజల్లో ఎవరైనా సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికి యెరూషలేముకు రాని పక్షంలో వారి ప్రాంతాల్లో వాన కురవదు. 18ఐగుప్తీయుల కుటుంబాలవారు బయలు దేరకుండా, రాకుండా ఉన్నట్టయితే వారికి వాన కురవకుండా పోతుంది. పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలను యెహోవా తాను నియమించిన తెగుళ్ళతో హింసిస్తాడు. 19ఐగుప్తీయులకు, పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలందరికీ సంభవించబోయే శిక్ష ఇదే.
20ఆ కాలంలో గుర్రాల కళ్ళాల పైన “యెహోవాకు ప్రతిష్టితం” అని రాసి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంటపాత్రలను బలిపీఠం ఎదుట ఉన్న గిన్నెల వలె పవిత్రంగా ఎంచుతారు. 21యెరూషలేములో, యూదా దేశంలో ఉన్న పాత్రలన్నీ సేనల ప్రభువు యెహోవాకు ప్రతిష్టితమౌతాయి. బలి అర్పించినవారు వధించిన దానిలో కావలసినదాన్ని తీసుకుని వంట చేసుకుంటారు. ఆ కాలంలో కనాను జాతివాడు#14:21 కనాను జాతివాడు వ్యాపారవేత్తలు ఎవ్వడూ సేనల ప్రభువు యెహోవా మందిరంలో కనిపించడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for జెకర్యా 14