YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 16

16
ఏడవ భాగం. క్రైస్తవ ప్రేమ, అభినందనలు
1కెంక్రేయలో ఉన్న మన సోదరి, సంఘ పరిచారిక అయిన ఫీబేను పవిత్రులకు తగిన విధంగా ప్రభువులో చేర్చుకోండి. 2మీ దగ్గర ఆమెకు అవసరమైనది ఏదైనా ఉంటే సహాయం చేయమని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె నాకు, ఇంకా చాలామందికి సహాయం చేసింది.
3క్రీస్తు యేసులో నా సహ పనివారు ప్రిస్కిల్లకు, అకులకు నా అభివందనాలు చెప్పండి. 4వారు నా ప్రాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి తెగించారు. వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘానికి కూడా అభివందనాలు చెప్పండి. నేను ఒక్కడినే కాదు, యూదేతర సంఘాలన్నీ వీరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి.
5ఆసియలో క్రీస్తుకు మొదటి ఫలం, నాకిష్టమైన ఎపైనెటుకు అభివందనాలు. 6మీకోసం అధికంగా కష్టపడిన మరియకు అభివందనాలు.
7నాకు బంధువులు, నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు అభివందనాలు. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో విశ్వసించినవారు.
8ప్రభువులో నాకు ప్రియమైన అంప్లీయతుకు అభివందనాలు.
9క్రీస్తులో మన జత పనివాడైన ఊర్బానుకు, నాకు ఇష్టుడైన స్టాకుకు అభివందనాలు.
10క్రీస్తులో యోగ్యుడైన అపెల్లెకు అభివందనాలు. అరిస్టొబూలు కుటుంబానికి అభివందనాలు.
11నా బంధువు హెరోదియోనుకు అభివందనాలు. నార్కిస్సు కుటుంబంలో ప్రభువును ఎరిగిన వారికి అభివందనాలు.
12ప్రభువులో ప్రయాసపడే త్రుపైనాకు, త్రుఫోసాకు అభివందనాలు. ప్రియమైన పెర్సిసుకు అభివందనాలు. ఆమె ప్రభువులో ఎంతో కష్టపడింది.
13ప్రభువు ఎన్నుకున్న రూఫుకు అభివందనాలు, అతని తల్లికి వందనాలు. ఆమె నాకు కూడా తల్లి.
14అసుంక్రితు, ప్లెగో, హెర్మే, పత్రొబ, హెర్మా, వారితో కూడా ఉన్న సోదరులకు అభివందనాలు.
15పిలొలొగుకు, యూలియాకు, నేరియకు, అతని సోదరికీ, ఒలుంపాకు వారితో కూడా ఉన్న పవిత్రులు అందరికీ అభివందనాలు.
16పవిత్రమైన ముద్దుతో ఒకడికొకడు అభివందనాలు చెప్పుకోండి. క్రైస్తవ సంఘాలన్నీ మీకు అభివందనాలు చెబుతున్నాయి.
17సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి. 18అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు. 19మీ విధేయత మంచి ఆదర్శంగా అందరికీ వెల్లడైంది. అందుకు మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషంగా ఉండాలి. 20సమాధాన కర్త అయిన దేవుడు త్వరలో సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక.
21నా సహ పనివాడు తిమోతి, నా బంధువులు లూకియ, యాసోను, సోసిపత్రు మీకు అభివందనాలు చెబుతున్నారు. 22ఈ పత్రికను చేతితో రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు అభివందనాలు చెబుతున్నాను.
23నాకు, సంఘమంతటికీ ఆతిథ్యమిచ్చే గాయి మీకు అభివందనాలు చెబుతున్నాడు. ఈ పట్టణానికి కోశాధికారి ఎరస్తు, సోదరుడు క్వర్తు, మీకు అభివందనాలు చెబుతున్నారు. 24మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
25యూదేతరులంతా విశ్వాసానికి లోబడేలా, దేవుడు ప్రారంభం నుండి దాచి ఉంచి, ఇప్పుడు వెల్లడి చేసిన రహస్య సత్యం శాశ్వతుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం, ప్రవక్తల ద్వారా వారికి వెల్లడైంది. 26నా సువార్త ప్రకారం, యేసు క్రీస్తును గురించిన ప్రవచన ప్రకటన ప్రకారం, దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిశాలి. 27ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి, యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్‌.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in