YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 21

21
ఏడు కొత్త విషయాలు. 1. కొత్త భూమి, 2. కొత్త ఆకాశం
1అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
3. కొత్త ప్రజ
3అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.
5అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు. 6ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. 7జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
8పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.
గొర్రెపిల్ల భార్య. 4. కొత్త యెరూషలేము
9అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు.
10ఆత్మ స్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు. 11యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా స్ఫటికంలా ధగ ధగా మెరుస్తూ ఉంది. 12ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ ప్రహరీ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి. 13తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి. 14ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి.
15నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాలనూ, ప్రహరీ గోడనూ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది. 16ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడుగూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే. 17తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే.
18ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంతో కట్టి ఉంది. 19ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది ఇంద్ర నీలం, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ, 20అయిదోది వైఢూర్యం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణలశునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది పద్మరాగం.
21దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.
5. కొత్త ఆలయం
22అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
6. కొత్త ప్రకాశం
23ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం. 24వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.
25రోజంతా దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు. 26వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు. 27పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in