YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 14

14
అదనపు వివరణ దర్శనాలు-గొర్రెపిల్లతో లక్షా నలభై నాలుగు వేల మంది
1తరువాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1, 44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి. 2అప్పుడు విస్తారజలం పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.
3వారంతా సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1, 44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు. 4వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకొన్న వారు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన జరిగిన వారు. 5అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.
శాశ్వత సువార్త గల దూత
6అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది. 7అతడు, “మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి.” అంటూ బిగ్గరగా చెప్పాడు.
బబులోను పతనం ప్రకటన
8వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. “నాశనమైపోయింది! తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైపోయింది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది” అని చెప్పాడు.
మృగాన్ని పూజించే వారి వినాశం
9తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. “ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించినా దాని ముద్రను తన నుదుటి మీదనో చేతి మీదనో వేయించుకున్నా 10వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారుచేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి.
11వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు విరామం లేకుండా బాధలపాలు అవుతూ ఉంటారు. 12దేవుని ఆదేశాలు పాటించేవారూ, యేసును విశ్వసించిన వారూ అయిన పరిశుద్ధులు సహనంతో కొనసాగాలి.”
పవిత్రులైన మృతుల ధన్యత
13అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, “ఇలా రాయి. ‘ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.’” నిజమే, వారు తమ బాధ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి వెనకే వెళ్తాయి.
మనుష్య కుమారుడి పంట కోత
14మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘంపై మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. 15అప్పుడు మరో దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, “పంట కోసే సమయం వచ్చింది. భూమి పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు.” 16అప్పుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదికి కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత జరిగింది.
దుర్మార్గుల పంటకోత
17అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది. 18మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్న దూతను పెద్ద కేక పెట్టి పిలిచాడు, “భూమి మీద ద్రాక్ష పళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్ష గుత్తులు కోయి” అన్నాడు. 19అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదికి విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోశాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.
20పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం గుర్రం కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in