YouVersion Logo
Search Icon

కీర్తన 9

9
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం.
1హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.
2మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.
3నా శత్రువులు వెనుదిరిగినప్పుడు, వాళ్ళు తొట్రుపడి నీ ఎదుట నాశనం అవుతారు.
4ఎందుకంటే, నా న్యాయయుక్తమైన పనిని నువ్వు సమర్థించావు. నీ సింహాసనం మీద ఒక నీతిగల న్యాయమూర్తిగా నువ్వు కూర్చున్నావు.
5నీ యుద్ధ నినాదంతో అన్యజాతులను నువ్వు భయభీతులను చేశావు. నువ్వు దుర్మార్గులను నాశనం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేశావు.
6తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి.
7కాని యెహోవా శాశ్వత కాలం ఉంటాడు. న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థాపిస్తాడు.
8యెహోవా లోకానికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. జాతుల కోసం న్యాయమైన నిర్ణయాలు చేస్తాడు.
9పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ.
10యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు.
11సీయోనులో ఏలుతున్న యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన చేసిన వాటిని జాతులకు చెప్పండి.
12ఎందుకంటే, రక్తపాతానికి శాస్తి చేసే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. పీడిత ప్రజల కేకలు ఆయన మరచిపోడు.
13యెహోవా, నా మీద దయ చూపించు. నన్ను ద్వేషించేవాళ్ళు నన్ను ఎలా పీడిస్తున్నారో చూడు. మరణద్వారం నుంచి నన్ను తప్పించగలిగిన వాడివి నువ్వే.
14నీ స్తుతి నేను ప్రచురం చేసేలా నన్ను తప్పించు. సీయోను కుమార్తె ద్వారాల్లో నీ రక్షణలో హర్షిస్తాను!
15జాతులు తాము తవ్విన గుంటలో తామే పడిపోయారు. తాము రహస్యంగా పన్నిన వలలో వారి కాళ్ళే చిక్కాయి.
16యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు. సెలా.
17దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి.
18అక్కరలో ఉన్నవాణ్ణి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పీడిత ప్రజల ఆశలు శాశ్వతంగా చెదిరిపోవడం జరగదు.
19యెహోవా లేచి రా, మనుషులకు మా మీద జయం కలగనివ్వకు. నీ సముఖంలో జాతులకు తీర్పు వస్తుంది గాక.
20యెహోవా, వాళ్ళను భయభీతులకు గురిచెయ్యి. తాము కేవలం మానవమాత్రులేనని జాతులు తెలుసుకుంటారు గాక. సెలా.

Currently Selected:

కీర్తన 9: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in