YouVersion Logo
Search Icon

కీర్తన 107

107
పంచమ పరిచ్ఛేదము
కీర్త 107-150
1యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.
2యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,
3తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.
4వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు.
5ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది.
6వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
7వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు.
8ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
9ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.
10చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు.
11దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది.
12కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు.
13కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు
14వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి, మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు.
15ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
16ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనపగడియలను విరగగొట్టాడు.
17బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు.
18భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు.
19కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు.
20ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.
21ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
22వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.
23ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు
24యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు.
25ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది.
26వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి#107:26 వారి నావికులు ప్రాణం కరిగిపోయింది.
27మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు.
28బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
29ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి.
30అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు.
31ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
32జనసమాజంలో వారాయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.
33ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను,
34దేశనివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు.
35అడివిని నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు.
36వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి, ద్రాక్షతోటలు నాటి,
37వాటివలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు.
38ఆయన వారిని ఆశీర్వదించగా వారికి సంతానాభివృద్ధి కలిగింది. ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు.
39వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు,
40శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు.
41అలాటి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తాడు. వారి వంశాన్ని మందవలె వృద్ధి చేశాడు.
42యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాళ్ళు మౌనంగా ఉంటారు.
43బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయాలను ప్రజలు తలపోస్తారు గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in