YouVersion Logo
Search Icon

కీర్తన 104

104
1నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు.
2ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు.
3జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు.
4వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు.
5భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు.
6దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి.
7నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి.
8నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి.
9అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు.
10ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి.
11అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి.
12వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి.
13తన మేడ గదుల్లోనుండి#104:13 మేడ గదుల్లోనుండి ఆకాశంలోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది.
14పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు
15అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు.
16యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి.
17అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.
18ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.
19ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.
20నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి.
21సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి.
22సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి.
23సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు.
24యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.
25అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి.
26అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి#104:26 చూడండి: కీర్త. 74:17 .
27తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి.
28నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి.
29నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి.
30నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు.
31యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక.
32ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి.
33నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.
34ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.
35పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in