YouVersion Logo
Search Icon

సంఖ్యా 9

9
పస్కా పండుగ
1యెహోవా సీనాయి అరణ్యంలో మోషేతో మాట్లాడాడు. ఇది వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం మొదటి నెలలో జరిగింది. ఆయన ఇలా చెప్పాడు. 2“ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగను దానికి నిర్ధారించిన తేదీల్లో ఆచరించాలి. 3దాన్ని నిర్ధారించిన కాలం ఈ నెల పద్నాలుగో రోజు. ఆ రోజు సాయంత్రం మీరు పస్కా జరుపుకోవాలి. దాన్ని ఆచరించాలి. దానికి సంబంధించిన నియమాలను, ఆదేశాలను తప్పక పాటించాలి.”
4కాబట్టి మోషే పస్కా పండగను ఆచరించాలని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. 5దాంతో సీనాయి అరణ్యంలో ఆ మొదటి నెలలో పద్నాలుగో రోజు సాయంత్రం వారు పస్కా ఆచరించారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు.
6కొంతమంది చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తాకి అపవిత్రులయ్యారు. కాబట్టి ఆ రోజు వారు పస్కా ఆచరించలేక పోయారు. 7ఆ వ్యక్తులు మోషే దగ్గరకి వచ్చి “మేము చనిపోయిన వ్యక్తి కారణంగానే కదా అపవిత్రులమయ్యాం. ఈ సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు బలి అర్పించకుండా మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు?” అని అడిగారు. 8దానికి మోషే “కాస్త ఆగండి. మీ గురించి యెహోవా ఏం చెబుతాడో విందాం.” అని జవాబిచ్చాడు.
9అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 10“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ‘మీలో ఎవరైనా లేదా మీ సంతానంలో ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడైనా, లేదా దూర ప్రయాణంలో ఉన్నా ఆ వ్యక్తి పస్కాను ఆచరించ వచ్చు.’
11వారు రెండో నెల పద్నాలుగో రోజున సాయంత్రం పస్కా ఆచరించాలి. పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలు, చేదు ఆకు కూరలతో తినాలి. 12మర్నాటి ఉదయానికి దానిలో దేన్నీ మిగల్చకూడదు. దాని ఎముకల్లో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాకి సంబంధించిన నియమాలన్నిటినీ వారు పాటించాలి.
13అయితే పవిత్రంగా ఉండీ, ప్రయాణమేదీ చేయని వాడు ఒకవేళ పస్కాను ఆచరించకపోతే ఆ వ్యక్తిని సమాజంలో లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు అవసరమైన బలి అర్పణ అర్పించలేదు. ఆ వ్యక్తి తన పాపాన్ని భరించాల్సిందే. 14మీ మధ్య నివసించే విదేశీయుడు ఎవరైనా యెహోవా గౌరవం కోసం పస్కాని ఆచరించాలనుకుంటే అతడు ఆయన ఆదేశాలను అనుసరించాలి. నియమాలను అనుసరించే పస్కా ఆచరించాలి. పస్కా అనుసరించే విషయంలో మీ దేశంలో పుట్టిన వాడికీ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒకే విధానం ఉండాలి.”
మందిరం పైగా మేఘం కనిపించుట
15మందిరాన్ని నిలబెట్టిన రోజున మేఘం నిబంధన శాసనాల గుడారాన్ని కమ్ముకుంది. సాయంత్రానికి మేఘం మందిరం పైగా కనిపించింది. అది మర్నాటి ఉదయం వరకూ అగ్నిలా కనిపించింది. 16అది ఎల్లప్పుడూ అలాగే కనిపించింది. మేఘం మందిరాన్ని కమ్మి రాత్రిలో అగ్నిలా కనిపించింది. 17గుడారం పైనుండి ఆ మేఘం పైకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించేవారు. ఆ మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నిలిచి గుడారాలు వేసుకునేవారు.
18యెహోవా ఆదేశాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించారు. ఆయన ఆదేశాల ప్రకారం గుడారాలు వేసుకుని నిలిచి పోయారు. మందిరం పైన మేఘం నిలిచినప్పుడు తమ శిబిరంలో ఉండే వారు. 19ఆ మేఘం ఒకవేళ ఎక్కువ రోజులు మందిరం పైన ఉండిపోతే యెహోవా ఆదేశాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవారు కాదు.
20కొన్నిసార్లు మేఘం కొన్ని రోజులు మాత్రమే మందిరం పైన నిలిచి ఉంటే వారు కూడా నిలిచిపోయే వారు. యెహోవా ఆదేశాల మేరకు గుడారాలు వేసుకుని తిరిగి ఆయన ఆదేశాల ప్రకారం ప్రయాణమయ్యే వారు. 21కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి మర్నాటి ఉదయం వరకూ ఉండేది. అప్పుడు ఉదయం మేఘం వెళ్ళగానే ప్రయాణం మొదలు పెట్టేవారు. ఒకవేళ మేఘం ఒక పగలూ ఒక రాత్రీ ఉంటే ఆ మేఘం వెళ్ళిన తరువాత మాత్రమే ప్రయాణం చేసేవారు.
22ఆ మేఘం రెండు రోజులు గానీ, ఒక నెల గానీ, లేదా ఒక సంవత్సరం గానీ మందిరం పైన నిలిచి పొతే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయకుండా తమ గుడారాల్లో ఉండి పోయారు. ఆ మేఘం వెళ్లి పోయిన తరువాత మాత్రమే ప్రయాణం చేశారు. 23యెహోవా ఆదేశాలకు విధేయులై వారు తమ గుడారాలు వేసుకున్నారు. యెహోవా ఆదేశాలకు విధేయులై ప్రయాణం చేశారు. యెహోవా మోషే ద్వారా తమకిచ్చిన ఆదేశాలకు వారు విధేయులయ్యారు.

Currently Selected:

సంఖ్యా 9: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for సంఖ్యా 9