YouVersion Logo
Search Icon

మార్కు 15

15
పిలాతు ముందు యేసు
మత్తయి 27:1, 2, 11-15; లూకా 23:1-7; 13-18; యోహా 18:28-40; 19:1-16
1తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు. 2పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నువ్వే అంటున్నావుగా” అని అతనికి జవాబిచ్చాడు.
3ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు. 4కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, “వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?” అన్నాడు. 5అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.
యేసు కాదు బరబ్బాయే
మత్తయి 27:16-26; లూకా 23:16-25; యోహా 18:40
6పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. 7బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు. 8జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు.
9పిలాతు, “యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అని అన్నాడు. 10ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు. 11కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు.
12పిలాతు, “అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?” అని అడిగాడు. 13వారు కేకలు వేస్తూ, “సిలువ వేయండి” అన్నారు. 14పిలాతు, “ఎందుకు? అతడు చేసిన నేరమేంటి?” అన్నాడు. జనసమూహం, “సిలువ వేయండి” అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. 15ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు.
ముళ్ళ కిరీటం
మత్తయి 27:27-31
16సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు. 17వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు. 18ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు. 19రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు.
20ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. 21కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు.
22వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం. 23అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు.
యేసు సిలువ శిక్ష
మత్తయి 27:33-56; యోహా 19:17-37
24ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు. 25ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు. 26“యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు. 27ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు. 28‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది.
29ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా! 30ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు. 31ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 32‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు.
33మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 34మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం. 35దగ్గర నిలుచున్న కొందరు అది విని, “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
36ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్పాంజ్ ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. “ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అని అతడు అన్నాడు. 37అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. 38ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది.
39యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు. 40కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు. 41యేసు గలిలయలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.
సమాధి
మత్తయి 27:57-61; లూకా 23:50-56; యోహా 19:38-42
42అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు. 43యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.
44యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు. 45ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు. 46యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు. 47మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy