YouVersion Logo
Search Icon

మార్కు 13

13
ఒలీవ కొండ ప్రసంగం – శిష్యుల ప్రశ్నలు
మత్తయి 24-25; లూకా 21
1యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అన్నాడు. 2యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి” అన్నాడు. 3యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు. 4“ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?”
ఒలీవ కొండ ప్రసంగం-ఈ యుగం తీరుతెన్నులు
5యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి. 6చాలా మంది నా పేరుతో వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలా మందిని మోసం చేస్తారు. 7మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.
8 జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే. 9మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.
11 వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.
12 సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. 13నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.
మహాబాధల కాలం
మత్తయి 24:15
14 “వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి.
15 మిద్దె మీద ఉన్న వారు కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు.
16 పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు.
17 గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం.
18 ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.
19 ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా.
20 దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు.
21 ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ‘ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదుగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి.
22 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు.
23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను.
మహిమతో ప్రభువు తిరిగి రాక
మత్తయి 24:27-31
24 “ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో,
సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు.
25 ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి.
ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.
26 అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. 27అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.”
అంజూరు చెట్టు ఉపమానం
మత్తయి 24:32, 33; లూకా 21:29-31
28 “అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు. 29అదే విధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి. 30నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి.
31 ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు. 32అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. 33జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.
ప్రభువు రెండవ రాకకై మెలకువగా ఎదురు చూడడం
34 “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు. 35కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. 36ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త! 37నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy