YouVersion Logo
Search Icon

మత్తయి 14

14
బాప్తిసమిచ్చే యోహాను వధ
మార్కు 6:14-29; లూకా 9:7-9
1ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని, 2“ఇతడు బాప్తిసమిచ్చే యోహాను, చనిపోయి తిరిగి లేచాడు. అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని తన సేవకులతో చెప్పాడు. 3అంతకు పూర్వం, “నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను చెప్పినందుకు 4హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు. 5హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు.
6హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది. 7కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు. 8తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం, “బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది. 9ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు. 10భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.
11వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది. 12యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు.
13యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు. 14యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.
యేసు ఐదు వేలమంది ఆకలి తీర్చడం
మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహా 6:1-14
15సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి” అన్నారు. 16యేసు వారితో, “వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అన్నాడు. 17వారు, “ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు” అని ఆయనతో అన్నారు. 18అందుకు ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. 19ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.
20వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి. 21స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.
యేసు నీటిపై నడవడం, పేతురు అల్ప విశ్వాసం
మార్కు 6:45-56; యోహా 6:15-21
22యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు. 23ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. 24అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది.
25రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. 26ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. 27వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. 28పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. 29యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని 30గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు. 31వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.
32యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది. 33అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
34వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు. 35అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు. 36“వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in