YouVersion Logo
Search Icon

యెహో 5

5
1వారు యొర్దానును దాటినంతసేపూ యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులూ, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులూ విన్నప్పుడు, వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు.
గిల్గాలు దాటడం, సున్నతి పొందడం
2ఆ సమయంలో యెహోవా “రాతికత్తులు చేయించి మళ్లీ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు” అని యెహోషువకు ఆజ్ఞాపించాడు. 3యెహోషువ రాతి కత్తులు చేయించి “గిబియత్ హరాలోత్#5:3 గిబియత్ హరాలోత్ సున్నతి కొండ ” అనే స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు.
4యెహోషువ సున్నతి చేయించటానికి కారణం, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధసన్నద్ధులైన వారందరూ ఐగుప్తు మార్గంలో అరణ్యంలోనే చనిపోయారు. 5బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గంలో పుట్టిన వారిలో ఎవ్వరూ సున్నతి పొందలేదు.
6యెహోవా మాట వినకపోవడం వల్ల వారికి ఏ దేశాన్ని ఇస్తానని వారి పితరులతో యెహోవా ప్రమాణం చేశాడో, ఆ పాలు తేనెలు ప్రవహించే#5:6 పాలు తేనెలు ప్రవహించే సారవంతమైన భూమి, నిర్గమ 3:8 చూడండి దేశాన్ని తాను వారికి ఇంక చూపించనని ప్రమాణం చేసినందువల్ల ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ నశించే వరకూ ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తూ ఉండిపోయారు. 7ఆయన వారికి స్థానంలో పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందలేదు కాబట్టి వారికి ఇప్పుడు సున్నతి చేయించాడు, ఎందుకంటే మార్గంలో వారికి సున్నతి జరగలేదు.
8కాబట్టి ప్రజలందరికీ సున్నతి చేయించిన తరువాత వారు బాగుపడే వరకూ శిబిరం లోనే ఉండిపోయారు. 9అప్పుడు యెహోవా “ఈ రోజు నేను ఐగుప్తు అవమానాన్ని మీ మీద నుండి దొర్లించి వేశాను” అని యెహోషువతో అన్నాడు. అప్పటినుండి నేటివరకూ ఆ స్థలానికి “గిల్గాలు#5:9 గిల్గాలు దొర్లించే ” అని పేరు.
10ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగో రోజు సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండగ ఆచరించారు. 11పస్కా పండగ అయిన ఉదయమే వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజే వారు పొంగని రొట్టెలనూ, వేయించిన ధాన్యాలనూ తిన్నారు. 12ఆ రోజు వారు ఆ దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది, అప్పటినుండి ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను తిన్నారు.
యెరికో పతనం
13యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు. 14అతడు “కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను” అన్నాడు.
యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి “నా యేలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు” అని అడిగాడు. 15అందుకు యెహోవా సేనాధిపతి “నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి” అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.

Currently Selected:

యెహో 5: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in