YouVersion Logo
Search Icon

యెహో 3

3
యొర్దాను దాటడం
1యెహోషువ వేకువనే లేచి అతడూ ఇశ్రాయేలీయులంతా షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటే ముందు అక్కడ బస చేశారు.
2మూడు రోజుల తరువాత నాయకులు శిబిరంలో తిరుగుతూ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు, 3“మీరు మీ యెహోవా దేవుని నిబంధన మందసాన్ని యాజకులుగా ఉన్న లేవీయులు మోసుకుని వెళ్తున్నప్పుడు మీరున్న స్థలం లో నుండి బయలుదేరి దాని వెంటే వెళ్ళాలి. 4మీకూ దానికీ దాదాపు రెండువేల మూరల#3:4 రెండువేల మూరల ఒక కిలోమీటరు దూరం ఉండాలి. ఆ మందసానికి సమీపంగా మీరు నడవకూడదు. ఎందుకంటే మీరు వెళ్ళే దారి మీరింతకు ముందు వెళ్ళింది కాదు, మీరు ఆ దారి గుర్తుపట్టాలి.”
5యెహోషువ ప్రజలతో “రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి” అన్నాడు. 6అతడు యాజకులతో “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడవండి” అని చెప్పాడు.
వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడిచారు. 7అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప వాడిగా చేస్తాను. 8మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్ళలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు.”
9కాబట్టి యెహోషువ “మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి” అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి, 10వారితో ఇలా చెప్పాడు. “సర్వలోక నాధుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానుని దాటబోతుంది కాబట్టి 11జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ, ఆయన కచ్చితంగా మీ దగ్గరనుండి కనానీయులనూ హిత్తీయులనూ హివ్వీయులనూ పెరిజ్జీయులనూ గిర్గాషీయులనూ అమోరీయులనూ యెబూసీయులనూ వెళ్ళగొడతాడని దీని వల్ల మీరు తెలుసుకుంటారు.
12కాబట్టి గోత్రానికి ఒక మనిషి చొప్పున ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి పన్నెండుమంది మనుషులను ఏర్పరచుకోండి. 13సర్వలోకనాధుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు, అంటే పై నుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి.”
14కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు. 15అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే 16పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు. 17ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.

Currently Selected:

యెహో 3: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in