యిర్మీయా 49
49
అమ్మోనీయుల గూర్చి ప్రవచనం
1అమ్మోను ప్రజలను గూర్చి యెహోవా ఇలా చెప్తున్నాడు.
“ఇశ్రాయేలుకు పిల్లలు లేరా? అతడికి వారసుడుగా ఎవరైనా ఉన్నారా?
మల్కోము దేవత గాదును ఎందుకు ఆక్రమించుకున్నాడు? వాడి ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తారు?”
2అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “రబ్బాకు వ్యతిరేకంగానూ, అమ్మోను ప్రజలకు వ్యతిరేకంగానూ నేను యుద్ధ భేరీని మోగించే రోజులు వస్తున్నాయి.
దాంతో రబ్బా అంతా వదిలివేసిన గుట్టలా ఉంటుంది. దాని ఊళ్ళు తగలబడి పోతాయి.
దాని వారసులను ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకుంటారు.
3హెష్బోనూ, రోదన చెయ్యి. ఎందుకంటే హాయి నాశనమై పోయింది. రబ్బా కుమార్తెలారా, ఏడవండి, గోనె పట్టలు కట్టుకోండి.
విలపించండి. ఊరకే అటూ ఇటూ పరుగెత్తండి. ఎందుకంటే మోలెకు దేవుడు చెరలోకి వెళ్తున్నాడు.
వాడితో పాటు వాడి యాజకులూ, అధిపతులూ కూడా చెరలోకి వెళ్తున్నారు.
4విశ్వాసం లేని కూతురా, నీ బలాన్ని గూర్చి నీకు అంత ఆహంకారమెందుకు? నీ బలం నీళ్ళ లాగా ప్రవహించి పోతుంది.
నీ సంపదలపై నమ్మకం పెట్టుకున్నావు. ‘నాకు విరోధిగా ఎవరొస్తారు?’ అంటున్నావు.
5చూడు. నీ పైకి తీవ్రమైన భయం తీసుకు వస్తున్నాను.” సేనల ప్రభువు అయిన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
“నీ చుట్టూ ఉన్న ప్రజలనుండి నీకు ఆ భయం వస్తుంది. దాని ఎదుట నువ్వు చెదరిపోతావు.
పారిపోతున్న వాళ్ళను పోగు చేయడానికి ఎవరూ ఉండరు.
6అయితే ఇదంతా అయ్యాక నేను అమ్మోను ప్రజల భాగ్యాన్ని పునరుద్ధరిస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
ఏదోమును గూర్చి ప్రవచనం
49:9-10; ఓబద్యా 5-6
49:14-16; ఓబద్యా 1-4
7ఏదోమును గూర్చి సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “తేమానులో జ్ఞానమనేదే లేదా?
అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర ఒక మంచి సలహా లేకుండా పోయిందా? వాళ్ళ జ్ఞానమంతా వెళ్లిపోయిందా?
8దేదాను నివాసులు పారిపోండి. వెనక్కి తిరగండి. నేలపై ఉన్న కలుగుల్లో ఉండండి.
ఎందుకంటే నేను ఏశావు ప్రజల పైకి ఆపదను రప్పించి అతణ్ణి శిక్షించబోతున్నాను.
9ద్రాక్షపళ్ళు ఏరుకునే వాళ్ళు నీ దగ్గరికి వస్తే, కొన్ని పళ్ళు వాళ్ళు వదిలేయరా?
రాత్రి వేళ దొంగలు వచ్చినప్పుడు, వాళ్లకు కావాల్సింది తీసుకుని మిగిలినది వదిలేయరా?
10కానీ నేను ఏశావును నగ్నంగా నిలబెడుతున్నాను. అతని రహస్య స్థలాలను బహిర్గతం చేస్తున్నాను. అతడు ఇక ఎక్కడా దాక్కోలేడు.
అతని సంతానం, సోదరులూ, అతడి పొరుగు వాళ్ళూ అంతా నాశనమవుతున్నారు. అతడూ మిగలడు.
11అనాథలైన పిల్లలను విడిచిపెట్టు. వాళ్ళను నేను చూసుకుంటాను. నీ వితంతువులు నన్ను నమ్ముకోవచ్చు.”
12యెహోవా ఇలా చెప్తున్నాడు. “పాత్రలోని దాన్ని తాగాల్సిన అవసరం లేని వాళ్ళు కూడా కచ్చితంగా పాత్రలోది కొంత తాగుతున్నారు. అలాంటప్పుడు నువ్వు శిక్షను ఎలా తప్పించుకుంటావు. తప్పించుకోలేవు. ఆ పాత్రలోది తప్పకుండా తాగాల్సిందే. 13బొస్రా భయాన్ని కలిగించే స్థలంగానూ, అవమానంగానూ, ఒక శాపవచనంగానూ ఉంటుంది. దాని పట్టణాలన్నీ ఎప్పటికీ నాశనమై ఉంటాయి. ఎందుకంటే నేను నా పేరు చెప్పి ప్రమాణం చేశాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
14యెహోవా దగ్గర నుండి నేనొక వార్త విన్నాను. ఆ వార్తతో జాతులన్నిటి దగ్గరికి ఒక వార్తాహరుడు వెళ్ళాడు.
“‘అందరం సమకూడి ఆమెపై దాడి చేద్దాం. యుద్ధానికి సిద్ధం కండి.’
15ఇతర జాతులతో పోలిస్తే నిన్ను అల్పుడుగా చేస్తాను. వాళ్ళ దృష్టిలో నిన్ను నీచుడిగా చేస్తాను.
16కొండ శిఖరాలపై నివసిస్తావు. పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నావు,
నీ భీకరత్వం విషయంలో నీ హృదయంలో గర్వం నిన్ను మోసం చేసింది.
గద్దలాగా ఉన్నత స్థలాల్లో గూడు కట్టుకుని ఉన్నావు.
అయినా నిన్ను అక్కడనుండి కిందకు లాగి పడవేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
17“ఏదోమును దాటి వెళ్ళే వాళ్ళకు అది భయం పుట్టిస్తుంది.
అందరూ దానికి కలిగిన కష్టాలు చూసి ఆశ్చర్యపడి ఎగతాళి చేస్తారు.”
18యెహోవా ఇలా చెప్తున్నాడు. “నేను సొదోమ, గొమొర్రా వాటి చుట్టూ ఉన్న పట్టణాలను నాశనం చేసినట్టే వీటికీ చేసిన తరువాత,
అక్కడిలాగే ఇక్కడ కూడా ఎవరూ నివసించరు. ఏ మనిషీ అక్కడ బస చేయడు.
19చూడండి, అతడు యొర్దాను అడవుల్లో నుండి ఎంతో కాలంగా ఉన్న పచ్చిక మైదానం లోకి వచ్చే సింహంలా వస్తున్నాడు.
దాన్ని చూసి ఏదోము తక్షణమే పారిపోయేలా చేస్తాను. దానిపైన నేను ఎంపిక చేసిన వాణ్ణి అధిపతిగా నియమిస్తాను.
ఎందుకంటే నాలాంటి వాడు ఎక్కడ ఉన్నాడు? నన్ను రమ్మని ఆజ్ఞాపించగలిగేది ఎవరు? నన్ను నిరోధించే కాపరి ఎవరు?
20కాబట్టి ఏదోముకు వ్యతిరేకంగా యెహోవా నిర్ణయించిన ప్రణాళికలను వినండి.
తేమాను నివాసులకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రణాళికలు వినండి.
కచ్చితంగా మందలో బలహీనమైన వాటితో సహా అందర్నీ శత్రువులు బయటకు ఈడుస్తారు.
పచ్చిక బయళ్ళు శిథిలమైన స్థలాలుగా మారతాయి.
21వాళ్ళు కూలినప్పుడు భూమి కంపించింది. దాని దుర్గతికి అది వేసే కేకలు ఎర్ర సముద్రం వరకూ వినిపించాయి.
22చూడండి డేగలా శత్రువు దాడి చేస్తాడు. అది దూసుకు వచ్చి బొస్రాను తన రెక్కలతో కప్పివేస్తుంది.
ఆ రోజున ఏదోము సైనికుల హృదయాలు ప్రసవించడానికి నొప్పులు పడుతున్న స్త్రీ హృదయంలా ఉంటాయి.”
23దమస్కు గూర్చిన వాక్యం. “హమాతు, అర్పాదూ జరిగిన వినాశనం వార్త విని సిగ్గుపడతాయి.
అవి కరిగిపోతున్నాయి. నిమ్మళంగా ఉండటం సాధ్యం కాని సముద్రంలా అవి కలవరపడుతున్నాయి.
24దమస్కు ఎంతో బలహీనంగా ఉంది. పారిపోడానికి అది వెనక్కు తిరిగింది. దాన్ని భయం పట్టుకుంది.
నిస్పృహ దాన్ని ఆవరించింది. ప్రసవించే స్త్రీ పడే వేదన వంటి వేదన దానికి కలిగింది.”
25దానిలో నివసించే ప్రజలు ఇలా అనుకుంటారు. “ఇంత ప్రసిద్ధి చెందిన పట్టణం, నాకెంతో ఆనందాన్ని ఇచ్చే పట్టణం ఇది. ప్రజలు దీనిని ఇంకా ఖాళీ చేయలేదేమిటి?”
26కాబట్టి పట్టణంలో యువకులు దాని వీధుల్లోనే కూలిపోతారు.
ఆ రోజున యుద్ధవీరులంతా అంతమై పోతారు. ఇది సేనల ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
27“నేను దమస్కు ప్రాకారం పై అగ్ని రాజేస్తాను. అది బెన్హదదు బలమైన దుర్గాలను తగలబెట్టేస్తుంది.”
28కేదారు, హాసోరు రాజ్యాలను గూర్చి యెహోవా బబులోనురాజు నెబుకద్నెజరుకు ఇలా చెప్పాడు. ఈ రాజ్యాలపై దాడి చేయడానికి నెబుకద్నెజరు వెళ్తున్నాడు.
కేదారు గూర్చి ప్రవచనం
“లేవండి. కేదారుపై దాడి చేయండి. ఆ తూర్పు దిక్కున ఉన్న ప్రజలను నాశనం చేయండి.
29అతని సైన్యం వాళ్ళ గుడారాలనూ, వాళ్ళ మందలనూ, గుడారాల తాళ్లనూ మిగిలిన సామాగ్రినంతా తీసుకు వెళ్తారు.
కేదారు ప్రజల ఒంటెలను వాళ్ళు తీసుకువెళ్తారు. ‘అన్ని వైపులా భయం’ అంటూ చెప్తారు.
30హాసోరు నివాసులారా, పారిపోండి. దూరంగా వెళ్ళండి. భూమి పైన ఉన్న కలుగుల్లో ఉండండి.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
“ఎందుకంటే బబులోను రాజు నెబుకద్నెజరు మీకు విరోధంగా ప్రణాళికలు రచిస్తున్నాడు. వెనక్కి తిరిగి పారిపోండి!
31మీరు లేవండి! నిశ్చింతగానూ క్షేమంగానూ నివసిస్తున్న రాజ్యంపై దాడి చేయండి.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
“వాళ్లకు ద్వారాలు లేవు. ఉన్నా వాటికి అడ్డు గడియలు లేవు. ప్రజలు హాయిగా నివసిస్తున్నారు.
32వాళ్ళ ఒంటెలు దోపుడు సొమ్ము అవుతాయి. విస్తారమైన వాళ్ళ సంపద మీకు యుద్ధంలో కొల్లగొట్టే సొమ్ముగా ఉంటుంది.
తర్వాత చెంపలపైన కత్తిరించుకునే వాళ్ళను చెదరగొడతాను.
వాళ్ళ మీదకు అన్ని వేపుల నుండీ ఆపద రప్పిస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
33“హాసోరు పాడై నక్కలకు నివాస స్థలంగా ఉంటుంది. శాశ్వతంగా వ్యర్ధభూమిగా ఉంటుంది.
అక్కడ ఎవ్వరూ నివాసముండరు. ఏ మనిషీ అక్కడ బస చేయడు.”
34యూదా రాజు సిద్కియా పరిపాలన ప్రారంభంలో యెహోవా వాక్కు యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఆయన ఏలాము గూర్చి ఇలా చెప్పాడు. 35“సేనల ప్రభువు యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేను ఏలాముకు ముఖ్య బలమైన వాళ్ళ విల్లునూ, దాన్ని సంధించే వాళ్ళనూ విరగగొడతాను.
36ఎలాగంటే ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు వాయువులను రప్పిస్తాను.
నాలుగు దిక్కుల నుండి వస్తున్న గాలులతో ఏలాము ప్రజలను చెదరగొడతాను.
చెదిరిపోయిన ఏలాము ప్రజలు వెళ్ళడానికి ఏ దేశమూ ఉండదు.
37వాళ్ళ శత్రువుల ఎదుటా, వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వారి ఎదుటా వాళ్ళను చెదరగొడతాను.
తీవ్రమైన నా క్రోధాన్ని బట్టి వాళ్లకు వ్యతిరేకంగా వినాశనాన్ని పంపుతాను.
వాళ్ళని సంపూర్ణంగా నిర్మూలం చేసే వరకూ వారి వెనకే కత్తిని పంపుతాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
38“ఏలాములో నా సింహాసనాన్ని నిలబెడతాను. అక్కడి రాజునూ, అధిపతులనూ నాశనం చేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
39“అయితే తర్వాత రోజుల్లో ఏలాము భాగ్యాన్ని పునరుద్ధరిస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
Currently Selected:
యిర్మీయా 49: IRVTel
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.