YouVersion Logo
Search Icon

యెషయా 7

7
ఇమ్మానుయేలు గురించిన సూచన
1యూదా రాజైన ఉజ్జియా మనవడు, యోతాము కుమారుడు అయిన ఆహాజు దినాల్లో సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడు అయిన పెకహు యెరూషలేముపై దండెత్తారు. అది వారివల్ల కాలేదు.
2అప్పుడు సిరియా వారు ఎఫ్రాయిము#7:2 ఎఫ్రాయిము ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం వారిని తోడు తెచ్చుకున్నారని దావీదు వంశం వారికి తెలిసినప్పుడు గాలికి అడవి చెట్లు ఊగినట్టు వారి హృదయాలు, వారి ప్రజల హృదయాలు గిలగిలలాడాయి.
3అప్పుడు యెహోవా యెషయాతో ఇలా చెప్పాడు. ఆహాజుకు ఎదురు వెళ్ళు. నీవు, నీ కుమారుడు షెయార్యాషూబు చాకిరేవు దారిలో ఎగువ కోనేటి కాలవ దగ్గరికి వెళ్ళండి.
4అతనితో చెప్పు “భద్రం. కంగారు పడకు. పొగ లేస్తున్న ఈ రెండు కాగడాలకు అంటే రెజీను, సిరియా వాళ్ళు, రెమల్యా కొడుకు పెకహు-వీళ్ళ కోపాగ్నికి జడిసి పోకు. బెదిరిపోకు.
5సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కొడుకు నీకు కీడు చేయాలని ఆలోచించారు.
6‘మనం యూదా దేశం మీదికి పోయి దాని ప్రజలను భయపెట్టి దాని ప్రాకారాలు పడగొట్టి టాబెయేలు కొడుకును దానిపై రాజుగా చేద్దాం రండి’ అని చెప్పుకున్నారు.”
7అయితే ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “ఆ మాట నిలవదు, అది జరగదు.
8సిరియాకు రాజధాని దమస్కు.
దమస్కుకు రాజు రెజీను.
అరవై ఐదు సంవత్సరాల లోపు ఎఫ్రాయిము ఒక జాతిగా ఉండకుండా నాశనమై పోతుంది.
9షోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని.
షోమ్రోనుకు రాజు రెమల్యా కొడుకు.
మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండక పోతే భద్రంగా ఉండరు.”
10యెహోవా ఆహాజుకు ఇంకా ఇలా చెప్పాడు.
11“నీ దేవుడైన యెహోవాను సూచన అడుగు. అది ఎంత లోతైనదైనా, ఎంత ఎత్తయినదైనా సరే.”
12కానీ ఆహాజు “నేను అడగను. యెహోవాను పరీక్షించను” అన్నాడు.
13కాబట్టి యెషయా ఇలా జవాబిచ్చాడు. “దావీదు వంశస్థులారా, వినండి. మనుషులను విసికించడం చాలదన్నట్టు నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా?
14కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది.
15కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి వచ్చేనాటికి అతడు పెరుగు, తేనె తింటాడు.
16కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి రాక ముందే ఎవరిని చూసి నువ్వు హడలి పోతున్నావో ఆ ఇద్దరు రాజుల దేశం నాశనమై పోతుంది.
17యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు.
ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు.
18ఆ దినాన దూరంగా ఐగుప్తు ప్రవాహాల దగ్గర ఉన్న జోరీగలను, అష్షూరు దేశపు కందిరీగలను యెహోవా ఈల వేసి పిలుస్తాడు.
19అవన్నీ వచ్చి మెట్టల్లో లోయల్లో బండల సందుల్లో ముళ్ళ పొదలన్నిటిలో గడ్డి బీడులన్నిటిలో దిగి ఉండిపోతాయి.
20ఆ దినాన యెహోవా నది (యూప్రటీసు) అవతలి నుండి కిరాయికి వచ్చే మంగలి కత్తితో, అంటే అష్షూరు రాజు చేత నీ తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను గొరిగిస్తాడు.
అది నీ గడ్డాన్ని కూడా గొరిగిస్తుంది.
21ఆ దినాన ఒకడు ఒక చిన్న ఆవును, రెండు గొర్రెలను పెంచుకుంటే
22అవి సమృద్ధిగా పాలిచ్చినందువల్ల అతడు పెరుగు తింటాడు.
ఎందుకంటే ఈ దేశంలో శత్రువులు వదిలేసి పోయిన వారందరూ పెరుగు తేనెలు తింటారు.
23ఆ దినాన వెయ్యి వెండి నాణేల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లు ఉండే ప్రతి స్థలంలో ముళ్ళతుప్పలు, బ్రహ్మజెముడు చెట్లు పెరుగుతాయి.
24ఈ దేశమంతా ముళ్ళ తుప్పలతో, బ్రహ్మ జెముడు చెట్లతో నిండి ఉంటుంది గనక విల్లంబులు చేతబట్టుకుని ప్రజలు వేటకు అక్కడికి పోతారు.
25ముళ్ళతుప్పల, బ్రహ్మ జెముడు చెట్ల భయం వల్ల మునుపు పారతో తవ్వి సాగు చేసిన కొండల వైపుకు మనుషులు పోరు.
అది పశువులు, గొర్రెలు పచ్చిక మేసే చోటుగా ఉంటుంది.”

Currently Selected:

యెషయా 7: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in