YouVersion Logo
Search Icon

యెషయా 57

57
1నీతిమంతులు చనిపోతున్నారు గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు.
నిబంధన ప్రజలు చనిపోతున్నారు గానీ ఎవరికీ అర్థం కావడం లేదు.
కీడు చూడకుండా నీతిమంతులను తీసివేయడం జరుగుతూ ఉంది.
2అతడు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాడు.
యథార్ధంగా ప్రవర్తించేవారు తమ పడకల మీద విశ్రాంతి తీసుకుంటారు.
3మంత్రకత్తె కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరిక్కడికి రండి!
4మీరెవర్ని ఎగతాళి చేస్తున్నారు?
ఎవర్ని చూసి నోరు తెరచి నాలుక చాస్తున్నారు?
మీరు తిరుగుబాటు చేసేవారూ మోసగాళ్ళూ కారా?
5సింధూర వృక్షాల కింద, పచ్చని ప్రతి చెట్టు కింద, కామంతో రగిలిపోయే మీరు,
లోయల్లో రాతిసందుల కింద, మీరు మీ పిల్లలను చంపుతున్నారు.
6లోయలోని రాళ్ళే మీ భాగం. అవే మీ వంతు.
వాటికే పానార్పణ పోస్తున్నారు. వాటికే నైవేద్యం అర్పిస్తున్నారు. వీటిలో నేను ఆనందించాలా?
7ఉన్నత పర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు.
బలులు అర్పించడానికి నువ్వు అక్కడికే ఎక్కి పోయావు.
8తలుపు వెనుక ద్వారబంధాల వెనుక నీ గుర్తులు ఉంచావు.
నన్ను వదిలిపెట్టి బట్టలు ఊడదీసి మంచమెక్కావు. నీ పరుపు వెడల్పు చేసుకున్నావు.
నువ్వు వాళ్ళతో నిబంధన చేసుకున్నావు. వాళ్ళ మంచాలంటే నీకిష్టం. నువ్వు వాళ్ళ మానం చూశావు.
9నువ్వు నూనె తీసుకుని రాజు దగ్గరికి వెళ్లావు. ఎన్నో పరిమళ ద్రవ్యాలను తీసుకెళ్ళావు.
నీ రాయబారులను దూరప్రాంతాలకు పంపుతావు. పాతాళానికి దిగిపోయావు.
10నీ దూర ప్రయాణాలతో నువ్వు అలసిపోయావు. అయితే “అది వ్యర్ధం” అని ఎన్నడూ అనలేదు.
నువ్వు నీ చేతుల్లో బలం తెచ్చుకున్నావు. కాబట్టి నువ్వు నీరసించిపోలేదు.
11ఎవరికి జడిసి, భయపడి అంత మోసం చేశావు?
నా గురించి ఆలోచించలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు.
చాలా కాలం నేను మౌనంగా లేను గదా! అయితే నువ్వు నన్నంతగా పట్టించుకోలేదు.
12నీ నీతి ఎలాంటిదో నేనే వెల్లడిచేస్తాను.
వాటివలన నీకేమీ ప్రయోజనం ఉండదు.
13నువ్వు కేకలు పెట్టేటప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పించాలి!
వాటన్నిటినీ గాలి ఎగరగొట్టేస్తుంది. ఊపిరితో అవన్నీ కొట్టుకుపోతాయి.
అయితే నన్ను నమ్ముకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.
సాత్వికులకు ఆదరణ
14ఆయన ఇలా అంటాడు. “కట్టండి, కట్టండి! దారి సిద్ధం చేయండి!
నా ప్రజల దారిలో అడ్డంగా ఉన్న వాటిని తీసేయండి.”
15ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.
16నేను ఎల్లప్పుడూ నిందించను. ఎప్పుడూ కోపంగా ఉండను. అలా ఉంటే మనిషి ఆత్మ నీరసించి పోతుంది. నేను సృష్టించిన మనుషులు నీరసించి పోతారు.
17అక్రమంగా సంపాదించిన అతని పాపాన్ని బట్టి నేను కోపపడి అతన్ని శిక్షించాను.
నా ముఖాన్ని కోపంతో చాటు చేశాను. అయితే అతడు తనకిష్టమైన దారిలోకి తిరిగి వెళ్ళిపోయాడు.
18నేనతని ప్రవర్తన చూశాను కానీ అతన్ని బాగుచేస్తాను.
అతనికి దారి చూపుతాను. అతన్నీ అతని కోసం దుఃఖించే వారినీ ఓదారుస్తాను.
19వారికి కృతజ్ఞతాపూర్వకమైన పెదాలు ఇస్తాను. దూరంగా ఉన్నవారికీ దగ్గరగా ఉన్నవారికీ శాంతి సమాధానాలుంటాయి” అని యెహోవా చెబుతున్నాడు. “నేనే వారిని బాగుచేస్తాను”
20అయితే దుర్మార్గులు అటూ ఇటూ కొట్టుకునే సముద్రం లాంటి వారు.
దాని నీళ్ళు, బురద పైకి తెస్తూ ఉంటుంది.
21“దుర్మార్గులకు ప్రశాంతత ఉండదు” అని దేవుడు చెబుతున్నాడు.

Currently Selected:

యెషయా 57: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in