YouVersion Logo
Search Icon

యెషయా 42

42
యెహోవా సేవకులు
1ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు.
ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు.
2ఆయన కేకలు వేయడు, అరవడు. ఆయన స్వరం వీధుల్లో వినబడదు.
3నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు.
ఆయన న్యాయాన్ని నమ్మకంగా అమలుచేస్తాడు.
4భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకూ ఆయన అలసిపోడు, నిరాశ చెందడు.
సముద్ర ద్వీపాలు అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తాయి.
5ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి,
దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
6“గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు.
7యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను.
నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను.
8నేనే యెహోవాను. నా పేరు ఇదే. నా మహిమను మరెవరితోనూ పంచుకోను. నాకు చెందాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనియ్యను.
9గతంలో చెప్పిన విషయాలు జరిగాయి కదా, ఇదిగో కొత్త సంగతులు మీకు చెబుతున్నాను. అవి జరగక ముందే వాటిని మీకు వెల్లడి చేస్తున్నాను.”
10సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి.
భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి.
11ఎడారీ, పట్టణాలూ, కేదారు ప్రాంతంలోని గ్రామాలూ సంతోషంతో కేకలు వేస్తాయి.
సెల ప్రాంతవాసులు పాటలు పాడతారు. పర్వతశిఖరాల నుండి వారు కేకలు వేస్తారు.
12ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు.
13యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు.
తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు.
14చాలాకాలం నుండి నేను మౌనంగా ఉన్నాను. నన్ను నేను అణచుకుంటూ మాట్లాడకుండా ఉన్నాను.
ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలాగా నేను బలవంతంగా ఊపిరి తీస్తూ ఒగరుస్తూ ఉన్నాను.
15పర్వతాలూ కొండలూ పాడైపోయేలా, వాటి మీద ఉన్న చెట్లన్నిటినీ ఎండిపోయేలా చేస్తాను.
నదులను ద్వీపాలుగా మారుస్తాను. నీటి మడుగులు ఆరిపోయేలా చేస్తాను.
16గుడ్డివారిని వారికి తెలియని దారిలో తీసుకువస్తాను. వారు నడవని మార్గాల్లో వారిని నడిపిస్తాను.
వారి చీకటిని వెలుగుగా, వంకరదారులను తిన్నగా చేస్తాను. ఈ పనులన్నీ నేను చేస్తాను. వారిని నేను విడిచిపెట్టను.
17చెక్కిన విగ్రహాలపై నమ్మకముంచి, పోతవిగ్రహాలతో, “మీరే మా దేవుళ్ళు” అని చెప్పేవారు వెనక్కి మళ్ళి సిగ్గు పడతారు.
ఇశ్రాయేలకు గ్రుడ్డితనం, చెవిటితనం
18చెవిటివారు వినండి, గుడ్డివారు మీరు గ్రహించగలిగేలా చూడండి.
19నా సేవకుడు తప్ప గుడ్డివాడు మరెవడు? నేను పంపిన నా దూత తప్ప చెవిటివాడు మరెవడు? నాతో నిబంధనలో ఉన్నవానికంటే, యెహోవా సేవకుని కంటే గుడ్డివాడు ఎవడు?
20నువ్వు చాలా విషయాలు చూస్తున్నావు గానీ గ్రహించలేకపోతున్నావు. చెవులు తెరిచే ఉన్నాయి గానీ వినడం లేదు.
21యెహోవా తన నీతికీ తన ధర్మశాస్త్రానికీ ఘనతామహిమలు కలగడంలో సంతోషించాడు.
22అయితే ఈ ప్రజలు దోపిడీకి గురయ్యారు. వారంతా గుహల్లో చిక్కుకుపోయారు, వారిని బంధకాల్లో ఉంచారు.
వారు దోపుడు పాలైనప్పుడు వారినెవరూ విడిపించలేదు. అపహరణకు గురైనప్పుడు “వారిని తిరిగి తీసుకురండి” అని ఎవరూ చెప్పలేదు.
23మీలో దీన్ని ఎవడు వింటాడు? భవిష్యత్తులోనైనా ఎవడు ఆలకించి వింటాడు?
24వారు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మార్గాల్లో నడుచుకోలేదు. ఆయన ఉపదేశాన్ని తిరస్కరించారు. అందుకు యెహోవాయే యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించాడు. ఇశ్రాయేలును దోచుకునేవారికి అప్పగించాడు.
25దాని కారణంగానే ఆయన వారిమీద తన కోపాగ్నినీ యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించాడు.
అది వారి చుట్టూ అగ్నిని రాజబెట్టింది గానీ వారు గ్రహించలేదు. అది వారిని కాల్చింది గానీ వారు దాన్ని పట్టించుకోలేదు.

Currently Selected:

యెషయా 42: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in