YouVersion Logo
Search Icon

యెహె 7

7
అసన్నమైన అంతం
1యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు. 2“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు.
అంతం! ఇశ్రాయేలు దేశం నాలుగు సరిహద్దులకు అంతం వచ్చేసింది.
3ఇప్పుడు అంతం మీ పైకి వచ్చింది.
ఎందుకంటే నా తీవ్ర కోపాన్ని మీ పైకి పంపుతున్నాను.
మీ ప్రవర్తనను బట్టి మీకు తీర్పు తీరుస్తాను.
తరువాత అసహ్యకరమైన మీ పనుల ఫలితాన్ని మీపైకి పంపుతాను.
4నా దృష్టిలో మీ పట్ల ఎలాంటి కనికరమూ చూపను.
నేనే యెహోవాను అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
5ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.
వినాశనం! వినాశనం వెనుకే మరో వినాశనం.
చూడండి! అది వచ్చేస్తూ ఉంది.
6అంతం వచ్చేస్తూ ఉంది.
అంతం నీకు విరోధంగా కళ్ళు తెరిచింది. చూడండి. అది వచ్చేస్తూ ఉంది.
7దేశవాసులారా, మీ నాశనం మిమ్మల్ని సమీపిస్తుంది.
సమయం వచ్చేసింది. నాశన దినం దగ్గరలోనే ఉంది.
పర్వతాలు ఇకమీదట ఆనందంగా ఉండవు.
8త్వరలోనే నా క్రోధాన్ని మీమీద కుమ్మరించబోతున్నాను.
నా తీవ్రమైన కోపాన్ని మీమీద చూపించ బోతున్నాను.
మీ ప్రవర్తనను బట్టి మీకు శిక్ష విధిస్తాను.
మీ నీచమైన పనుల ఫలాన్ని మీ పైకి తీసుకు వస్తాను.
9నాకు మీ పట్ల కనికరం లేదు.
నేను మిమ్మల్ని వదలను.
మీరు చేసినట్టే నేనూ మీకు చేస్తాను.
మిమ్మల్ని శిక్షించే యెహోవాను నేనే అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
10చూడండి! ఆ రోజు వచ్చేస్తుంది. నాశనం బయలు దేరింది.
ఆ దండం పుట్టింది. దానికి గర్వం వికసించింది.
11బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది.
వాళ్ళలో గానీ, వాళ్ళ మూకలో గానీ ఎవరూ మిగలరు.
వాళ్ళ సంపదలో గానీ, వాళ్ళ ప్రాముఖ్యతలో గానీ ఏదీ మిగలదు.
12ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది.
నా కోపం ప్రజలందరి పైనా ఉంది కనుక కొనేవాడు సంతోషించకూడదు.
13అమ్మినవాడు వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం తాను అమ్మిన భూమికి తిరిగి రాడు.
ఎందుకంటే ఈ దర్శనం ప్రజలందరికీ విరోధంగా ఉంది.
పాపంలో నివసించే ఏ మనిషీ ధైర్యంగా తన ప్రాణాన్ని దక్కించుకోలేడు. అందుకే వాళ్ళెవ్వరూ తిరిగిరారు.
14వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు.
కానీ యుద్ధానికి బయల్దేరే వాడు ఎవడూ లేడు.
15ఖడ్గం బయట ఉంది. లోపలేమో కరవూ, తెగులూ ఉన్నాయి.
బయట ఉన్నవాళ్ళు ఖడ్గం వాతపడతారు.
పట్టణంలో ఉన్నవాళ్ళని కరవూ, తెగులూ మింగివేస్తాయి.
16అయితే వాళ్ళలో కొంతమంది తప్పించుకుని పర్వతాల పైకి పారిపోతారు.
వాళ్ళు అందరూ లోయలో ఉండే గువ్వల్లాగా మూలుగుతారు.
17వాళ్ళందరి చేతులూ తడబడతాయి. మోకాళ్ళు నీళ్ళలా బలహీనం అవుతాయి.
18వారు గోనెపట్ట ధరిస్తారు. తీవ్రమైన భయం వాళ్ళని కమ్ముకుంటుంది.
ప్రతి ఒక్కరి ముఖం పైనా అవమానం ఉంటుంది.
బోడితనం వాళ్ళ తలల మీద కనిపిస్తుంది.
19వాళ్ళు తమ దగ్గర ఉన్న వెండిని వీధుల్లో పారేస్తారు.
బంగారం వాళ్లకి వ్యర్ధపదార్ధంలా ఉంటుంది.
యెహోవా కోప దినాన వెండిబంగారాలు వాళ్ళను కాపాడలేవు.
వాళ్ళ దోషం పెను ఆటంకంగా ఉంటుంది గనక వాళ్ళ జీవితాలకు రక్షణ ఉండదు. వాళ్ళ కడుపులకు పోషణ ఉండదు.
20వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు.
అవి వాళ్ళ నీచమైన పనులను వర్ణించే విగ్రహ ఆకారాలుగా ఏర్పడ్డాయి.
వాటితో వాళ్ళు అసహ్యకరమైన తమ పనులను సాగించారు. కాబట్టి ఆ ఆభరణాలు వాళ్లకి అసహ్యం పుట్టేలా నేను చేస్తాను.
21వాటిని ఇతర దేశస్తుల చేతికి అప్పగిస్తాను.
దుర్మార్గుల చేతికి దోపిడీ సొమ్ముగా ఇస్తాను. వాళ్ళు వాటిని అపవిత్రం చేస్తారు.
22వాళ్ళు నా ఖజానాను అపవిత్రం చేస్తుంటే చూడకుండా నా ముఖం తిప్పుకుంటాను.
బందిపోట్లు దానిలో ప్రవేశించి దాన్ని అపవిత్రం చేస్తారు.
23తీర్పుని బట్టి దేశం రక్తంతోనూ, పట్టణం హింసతోనూ నిండిపోయింది. అందుకే సంకెళ్ళు సిద్ధం చేయండి.
24జాతుల్లోకెల్లా అత్యంత దుర్మార్గమైన జాతిని నేను పంపుతాను. వాళ్ళు వచ్చి ఇళ్ళను స్వాధీనం చేసుకుంటారు.
వాళ్ళ పవిత్ర స్థలాలను అపవిత్రం చేసి బలశూరుల అహంకారానికి స్వస్తి చెపుతాను!
25భయం కలుగుతుంది! వాళ్ళు శాంతిని వాంచిస్తారు కానీ అది వారికి దొరకదు.
26నాశనం తరువాత నాశనం కలుగుతుంది.
పుకార్ల తరువాత పుకార్లు పుట్టుకొస్తాయి.
వాళ్ళు ప్రవక్తల దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు. యాజకులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేకుండా పోతుంది.
సలహా ఇచ్చే పెద్దలకు తెలివి ఉండదు. 27రాజు విచారంగా ఉంటాడు. యువరాజు నిస్పృహలో సామాన్య వస్త్రాలు ధరిస్తాడు.
దేశ ప్రజల చేతులు భయంతో వణకుతాయి.
వాళ్ళ విధానంలోనే నేను వాళ్లకి ఇలా చేస్తాను.
నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకునే వరకూ వాళ్ళ ప్రమాణాలను బట్టే వాళ్ళకి తీర్పు తీరుస్తాను.”

Currently Selected:

యెహె 7: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in