YouVersion Logo
Search Icon

ఎఫెసీ పత్రిక 3

3
సంఘం ఒక మర్మం
1ఈ కారణం చేత యూదేతర విశ్వాసులైన మీకోసం క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థిస్తున్నాను. 2మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గూర్చి మీరు వినే వుంటారు. 3అదేమంటే దర్శనం ద్వారా నాకు క్రీస్తు మర్మం వెల్లడైంది. దీని గురించి మీకు కూడా తెలిసిన సంగతి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను. 4మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తు మర్మం విషయంలో నేను పొందిన పరిజ్ఞానం గ్రహించగలరు.
5ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు. 6ఈ మర్మం ఏమిటంటే, సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలిభాగస్తులు అనేదే.
7నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది. 8పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి అయినా మన ఊహకందని క్రీస్తు ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికీ, 9సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు. 10తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా వాయుమండలంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. 11అది మన ప్రభువైన క్రీస్తు యేసులో చేసిన ఆయన నిత్య సంకల్పం. 12క్రీస్తుపై మన విశ్వాసం చేత ఆయనను బట్టి మనకి ధైర్యం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించే నిబ్బరం కలిగింది.
అంతరంగ పరిపూర్ణత, జ్ఞానాలకై ప్రార్థన
13కాబట్టి మీ నిమిత్తం నాకు కలిగిన హింసలు చూసి మీరు అధైర్యపడవద్దని చెబుతున్నాను. ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి. 14-15ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను. 16-17ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన 18పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ 19జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.
20మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవునికి, 21సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్‌.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ఎఫెసీ పత్రిక 3