YouVersion Logo
Search Icon

ప్రసంగి 8

8
అధికారానికి విధేయత
1జ్ఞానులంటే ఎవరు?
జీవితంలో జరిగేవి ఏమిటి, ఎలా అనే విషయాలు ఎరిగినవారు.
మనుషుల జ్ఞానం వారి ముఖానికి తేజస్సు నిస్తుంది. దాని వలన వారి కఠినత్వం మారుతుంది.
2నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో. 3రాజు సన్నిధి నుండి హడావుడిగా బయటికి వెళ్లకు. అతడు అనుకున్న దానంతటినీ జరిగించగలడు కాబట్టి చెడు కార్యాల్లో పాలు పుచ్చుకోకు. 4రాజుల ఆజ్ఞ అధికారంతో కూడినది. “నువ్వు చేసేది ఏమిటి?” అని రాజును అడిగే వాడెవడు?
5రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు.
ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు.
6ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది.
అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది.
7జరగబోయేది మనుషులకి తెలియదు.
రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు?
8ఊపిరి#8:8 ఊపిరి ఆత్మ విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు.
తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు.
యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు.
దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు.
9సూర్యుని కింద జరిగే ప్రతి పని గురించి నేను తీవ్రంగా ఆలోచించినప్పుడు ఇదంతా నాకు తెలిసింది.
ఒకడు మరొకడిపై ఉన్న అధికారంతో వాడికి కీడు జరిగిస్తాడు.
10దుష్టులను సక్రమంగా పాతిపెట్టడం, పరిశుద్ధ స్థలం నుండి తీసుకుపోవడం, వారు ఎక్కడ చెడ్డ పనులు చేశారో అదే పట్టణస్థులు వారిని పొగడడం#8:10 పొగడడం మరచిపోవడం నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనమే. 11చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు. 12ఒక దుర్మార్గుడు వంద సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించినా, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు. 13దుర్మార్గులు దేవుని సన్నిధికి భయపడరు కాబట్టి వారికి క్షేమం ఉండదు. వారి జీవితకాలం అశాశ్వతమైన నీడలాగా ఉంటుంది.
14సూర్యుని కింద మరొక నిష్ప్రయోజనమైంది జరుగుతూ ఉంది. అదేమంటే భక్తిహీనులకు జరిగినట్టు నీతిమంతుల్లో కొందరికీ నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనుల్లో కొందరికీ జరుగుతున్నది. ఇది కూడా నిష్ప్రయోజనమే అని నేను అనుకున్నాను. 15అన్నపానాలు పుచ్చుకుని సంతోషించడం కంటే మనుషులకు మంచి విషయమేమీ లేదు. మనిషి పని చేసి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన అతని జీవిత కాలమంతా వారికి తోడుగా ఉండేది వారి సంతోషమే.
16జ్ఞానాన్ని అభ్యసించడానికీ మనుషులు దివారాత్రులు నిద్ర లేకుండా చేసే వ్యాపారాలను పరిశీలించి చూశాను. 17దేవుని పనులన్నిటినీ నేను గమనించాను. సూర్యుని కింద జరిగే సంగతులను మనుషులు ఎంత ప్రయత్నించినా గ్రహించలేరనీ, దాన్ని తెలుసుకోవాలని చివరికి జ్ఞానులు పూనుకున్నప్పటికీ వారు సైతం గ్రహించలేరనీ నేను తెలుసుకున్నాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in