ద్వితీ 28
28
విధేయతకు వచ్చే దీవెనలు
1“మీరు మీ యెహోవా దేవుని మాట శ్రద్ధగా విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటే మీ దేవుడైన యెహోవా భూమి మీదున్న ప్రజలందరి కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. 2మీరు మీ యెహోవా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు.
3పట్టణంలో, పొలంలో మీకు దీవెనలు కలుగుతాయి. 4మీ గర్భఫలం, మీ భూఫలం, మీ పశువుల మందలూ, మీ దుక్కిటెద్దులూ, మీ గొర్రె మేకల మందల మీద దీవెనలుంటాయి.
5మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి. 6మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి. 7యెహోవా మీ మీదికి వచ్చే మీ శత్రువులు మీ ఎదుట హతమయ్యేలా చేస్తాడు. వాళ్ళు ఒక దారిలో మీ మీదికి దండెత్తి వచ్చి ఏడు దారుల్లో మీ ఎదుట నుంచి పారిపోతారు.
8మీ ధాన్యపు గిడ్డంగుల్లో మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మీకు దీవెన కలిగేలా యెహోవా ఆజ్ఞాపిస్తాడు. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 9మీరు మీ యెహోవా దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన మార్గాల్లో నడుచుకుంటే యెహోవా మీకు ప్రమాణం చేసినట్టు ఆయన తనకు ప్రతిష్టిత ప్రజగా మిమ్మల్ని స్థాపిస్తాడు. 10భూప్రజలంతా యెహోవా పేరుతో మిమ్మల్ని పిలవడం చూసి మీకు భయపడతారు.
11యెహోవా మీకిస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా మీ గర్భఫలాన్నీ మీ పశువులనూ మీ పంటనూ సమృద్ధిగా వర్ధిల్లజేస్తాడు. 12యెహోవా మీ దేశం మీద దాని కాలంలో వాన కురిపించడానికీ మీరు చేసే పనంతటినీ ఆశీర్వదించడానికీ ఆకాశ గిడ్డంగులను తెరుస్తాడు. మీరు అనేక రాజ్యాలకు అప్పిస్తారు కాని అప్పు చెయ్యరు.
13ఇవ్వాళ నేను మీకాజ్ఞాపించే మాటలన్నిటిలో ఏ విషయంలోనూ కుడివైపుకు గాని, ఎడమవైపుకు గాని తొలగిపోకుండా 14వేరే దేవుళ్ళను పూజించడానికి వాటి వైపుకు పోకుండా మీరు అనుసరించి నడుచుకోవాలని ఇవ్వాళ నేను మీ కాజ్ఞాపిస్తున్నాను. మీ యెహోవా దేవుని ఆజ్ఞలు విని, వాటిని పాటిస్తే యెహోవా మిమ్మల్ని తలగా చేస్తాడు గానీ తోకగా చెయ్యడు. మీరు పైస్థాయిలో ఉంటారు గానీ కిందిస్థాయిలో ఉండరు.
విధేయతకు వచ్చే శాపాలు
15నేను ఇవ్వాళ మీకాజ్ఞాపించే అన్ని ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటించాలి. మీ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి. 16పట్టణంలో మీకు శాపాలు ఉంటాయి. పొలంలో మీకు శాపాలు ఉంటాయి. 17మీ గంప, పిండి పిసికే మీ తొట్టి మీద శాపాలు ఉంటాయి. 18మీ గర్భఫలం, మీ భూపంట, మీ పశువుల మందల మీద శాపాలు ఉంటాయి. 19మీరు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు శాపాలు ఉంటాయి.
20మీరు నన్ను విడిచిపెట్టి, మీ దుర్మార్గపు పనులతో మీరు నాశనమైపోయి త్వరగా నశించే వరకూ, మీరు చేద్దామనుకున్న పనులన్నిటిలో యెహోవా శాపాలను, కలవరాన్నీ, నిందనూ మీ మీదికి తెప్పిస్తాడు. 21మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా మీరు నాశనమయ్యే వరకూ తెగులు మీకు అంటిపెట్టుకుని ఉండేలా చేస్తాడు.
22యెహోవా మీపై అంటు రోగాలతో, జ్వరంతో, అగ్నితో, #28:22 అనావృష్టి, లేదా కత్తితో.కరువుతో, మండుటెండలతో, వడగాడ్పులతో, బూజు తెగులుతో దాడి చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అవి మిమ్మల్ని వెంటాడతాయి.
23మీ తల మీద ఆకాశం కంచులా ఉంటుంది. మీ కిందున్న నేల ఇనుములా ఉంటుంది. 24యెహోవా మీ ప్రాంతంలో పడే వానను పిండిలాగా, ధూళిలాగా చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అది ఆకాశం నుంచి మీ మీద పడుతుంది.
25యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి ఏడు దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదరిపోతారు. 26నీ శవం అన్ని రకాల పక్షులకూ, క్రూర మృగాలకూ ఆహారమవుతుంది. వాటిని బెదిరించే వాడెవడూ ఉండడు.
27యెహోవా ఐగుప్తు కురుపులతో, పుండ్లతో, చర్మవ్యాధులతో, దురదతో మిమ్మల్ని బాధిస్తాడు. మీరు వాటిని బాగుచేసుకోలేరు. 28పిచ్చి, గుడ్డితనం, ఆందోళనతో యెహోవా మిమ్మల్ని బాధిస్తాడు. 29ఒకడు గుడ్డివాడుగా చీకట్లో వెతుకుతున్నట్టు మీరు మధ్యాహ్న సమయంలో వెతుకుతారు. మీరు చేసే పనుల్లో అభివృద్ది చెందరు. ఇతరులు మిమ్మల్ని అణిచివేస్తారు, దోచు కుంటారు. ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు.
30ఒక కన్యను నువ్వు ప్రదానం చేసుకుంటావు కానీ వేరేవాడు ఆమెను లైంగికంగా కలుస్తాడు. మీరు ఇల్లు కడతారు కానీ దానిలో కాపురం చెయ్యరు. ద్రాక్షతోట నాటుతారు కానీ దాని పండ్లు తినరు. 31మీ కళ్ళముందే మీ ఎద్దును కోస్తారు కానీ దాని మాంసాన్ని మీరు తినరు. మీ దగ్గర నుంచి మీ గాడిదను బలవంతంగా తీసుకెళ్ళిపోతారు. దాన్ని తిరిగి మీకు ఇవ్వరు. మీ గొర్రెలను మీ విరోధులకు ఇస్తారు కానీ మీకు సహాయం చేసేవాడు ఎవ్వడూ ఉండడు.
32మీ కొడుకులను, కూతుళ్ళను అన్య జనులతో పెండ్లికి ఇస్తారు. వారి కోసం మీ కళ్ళు రోజంతా ఎదురు చూస్తూ అలిసిపోతాయి గానీ మీ వల్ల ఏమీ జరగదు. 33మీకు తెలియని ప్రజలు మీ పొలం పంట, మీ కష్టార్జితమంతా తినివేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ బాధించి, అణచి ఉంచుతారు. 34మీ కళ్ళ ముందు జరిగే వాటిని చూసి మీకు కలవరం పుడుతుంది. 35యెహోవా నీ అరకాలి నుంచి నడినెత్తి వరకూ మోకాళ్ల మీదా తొడల మీదా మానని కఠినమైన పుండ్లు పుట్టించి మిమ్మల్ని బాధిస్తాడు.
36యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు. 37యెహోవా మిమ్మల్ని చెదరగొట్టే ప్రజల్లో సామెతలు పుట్టడానికీ, నిందలకూ అస్పదం అవుతావు.
38ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి. 39ద్రాక్షతోటలను మీరు నాటి, వాటి బాగోగులు చూసుకుంటారు కానీ ఆ ద్రాక్షారసాన్ని తాగరు. ద్రాక్ష పండ్లు కొయ్యరు. ఎందుకంటే పురుగులు వాటిని తినేస్తాయి.
40మీ ప్రాంతమంతా ఒలీవ చెట్లు ఉంటాయి కానీ ఆ నూనె తలకు రాసుకోరు. ఎందుకంటే మీ ఒలీవ కాయలు రాలిపోతాయి. 41కొడుకులనూ కూతుర్లనూ కంటారు కానీ వారు మీదగ్గర ఉండరు. వారు బందీలుగా వెళ్లితారు.
42మీ చెట్లూ, మీ పంట పొలాలూ మిడతల వశమైపోతాయి. 43మీ మధ్యనున్న పరదేశి మీకంటే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. మీరు అంతకంతకూ కిందిస్థాయికి దిగజారతారు. 44అతడు మీకు అప్పిస్తాడు గానీ మీరు అతనికి అప్పివ్వలేరు. అతడు తలగా ఉంటాడు, మీరు తోకగా ఉంటారు.
45మీరు నాశనమయ్యేవరకూ ఈ శిక్షలన్నీ మీ మీదికి వచ్చి మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి. ఎందుకంటే మీ యెహోవా దేవుడు మీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలనూ, ఆయన చట్టాలనూ అనుసరించి నడుచుకొనేలా మీరు ఆయన మాట వినలేదు. 46అవి ఎప్పటికీ మీ మీద, మీ సంతానం మీద సూచనలుగా, ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి.
47మీకు సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా, హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను ఆరాధించలేదు. 48కాబట్టి యెహోవా మీ మీదికి రప్పించే మీ శత్రువులకు మీరు బానిసలవుతారు. ఆకలితో, దాహంతో, దిగంబరులుగా, పేదరికం అనుభవిస్తూ వారికి సేవ చేస్తారు. మీరు నాశనం అయ్యే వరకూ #28:48 లేక శత్రువులుయెహోవా మీ మెడ మీద ఇనుపకాడి ఉంచుతాడు.
49దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు. 50వాళ్ళు క్రూరత్వం నిండినవారై ముసలివాళ్ళను, పసి పిల్లలను కూడా తీవ్రంగా హింసిస్తారు. 51మిమ్మల్ని నాశనం చేసే వరకూ మీ పశువులనూ మీ పొలాల పంటనూ దోచుకుంటారు. మీరు నాశనం అయ్యేంత వరకూ మీ ధాన్యం, ద్రాక్షారసం, నూనె, పశువుల మందలు, గొర్రె మేకమందలు మీకు మిగలకుండా చేస్తారు.
52మీరు ఆశ్రయించే ఎత్తయిన కోట గోడలు కూలిపోయే వరకూ మీ దేశమంతా మీ పట్టణ ద్వారాల దగ్గర వారు మిమ్మల్ని ముట్టడిస్తారు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ దేశమంతటిలో మీ పట్టణ గుమ్మాల దగ్గర మిమ్మల్ని ముట్టడిస్తారు. 53ఆ ముట్టడిలో మీ శత్రువులు మిమ్మల్ని పెట్టే బాధలు తాళలేక మీ సంతానాన్ని, అంటే మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మీ కొడుకులను, కూతుళ్ళను చంపి, వాళ్ళ మాంసం మీరు తింటారు.
54మీలో మృదు స్వభావి, సుకుమారత్వం గల వ్యక్తి కూడా తన సొంత పిల్లల మాంసాన్ని తింటాడు. వాటిలో కొంచెమైనా తన సోదరునికి గానీ, తన ప్రియమైన భార్యకుగానీ, తన మిగతా పిల్లలకు గానీ మిగల్చడు. వాళ్ళపై జాలి చూపడు. 55ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిలో మిమ్మల్ని పెట్టే ఇబ్బందిలో ముట్టడిలో అతనికేమీ మిగలదు.
56మీలో మృదువైన, అతి సుకుమారం కలిగిన స్త్రీ, సుకుమారంగా నేల మీద తన అరికాలు మోపలేని స్త్రీ కూడా తన కాళ్లమధ్యనుండి బయటకు వచ్చే పసికందును రహస్యంగా తింటుంది. వాటిలో కొంచెమైనా తనకిష్టమైన సొంత భర్తకూ తన కొడుకూ కూతురుకూ పెట్టదు. 57వారిపట్ల దయ చూపించదు. ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిని ముట్టడించి మిమ్మల్ని దోచుకోవడం వల్ల, కడుపు నింపుకోవడానికి మీకేమీ మిగలదు.
58ఈ గ్రంథంలో రాసిన ఈ ధర్మశాస్త్ర సూత్రాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తించక, మీ యెహోవా దేవుని ఘనమైన నామానికి, భయభక్తులు కనపరచకపోతే 59యెహోవా మీకూ మీ సంతానానికీ దీర్ఘకాలం ఉండే, మానని భయంకరమైన రోగాలు, తెగుళ్ళు రప్పిస్తాడు.
60మీకు భయం కలిగించే ఐగుప్తు రోగాలన్నీ మీమీదికి రప్పిస్తాడు. అవి మిమ్మల్ని వదిలిపోవు. 61మీరు నాశనం అయ్యే వరకూ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయని ప్రతి రోగం, ప్రతి వ్యాధి ఆయన మీకు తెస్తాడు. 62మీరు మీ యెహోవా దేవుని మాట వినలేదు కాబట్టి, అంతకుముందు మీరు ఆకాశనక్షత్రాల్లాగా విస్తరించినప్పటికీ కొద్దిమందే మిగిలి ఉంటారు.
63మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ది చేయడంలో మీ యెహోవా దేవుడు మీపట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చెయ్యడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు. 64యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు.
65ఆ ప్రజల మధ్య మీకు నెమ్మది ఉండదు. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ మీ గుండెలు అదిరేలా, కళ్ళు మసకబారేలా, మీ ప్రాణాలు కుంగిపోయేలా యెహోవా చేస్తాడు. 66చస్తామో, బతుకుతామో అన్నట్టుగా ఉంటారు. బతుకు మీద ఏమాత్రం ఆశ ఉండదు. పగలూ రాత్రి భయం భయంగా గడుపుతారు.
67రాత్రింబవళ్ళూ భయం భయంగా కాలం గడుపుతారు. మీ ప్రాణాలు నిలిచి ఉంటాయన్న నమ్మకం మీకు ఏమాత్రం ఉండదు. మీ హృదయాల్లో ఉన్న భయం వల్ల ఉదయం పూట ఎప్పుడు సాయంత్రం అవుతుందా అనీ, సాయంకాలం పూట ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటారు.
68మీరు ఇకపై ఐగుప్తు చూడకూడదు అని నేను మీతో చెప్పిన మార్గంలోగుండా యెహోవా ఓడల మీద ఐగుప్తుకు మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. మీరు అక్కడ దాసులుగా, దాసీలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరే అమ్ముకోవాలని చూస్తారు కానీ మిమ్మల్ని కొనేవారెవ్వరూ ఉండరు.”
Currently Selected:
ద్వితీ 28: IRVTel
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.