YouVersion Logo
Search Icon

ద్వితీ 23

23
సమాజం నుంచి తొలగింపు
1“చితికిన వృషణాలు ఉన్నవాళ్ళు, లేదా పురుషాంగం కోసిన వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు. 2అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.
3అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. 4ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు.
5అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు. 6మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు.
7ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్ళను ద్వేషించవద్దు.
ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు, కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు. 8వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు.
శిబిరం పవిత్రంగా ఉంచాలి
9మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి. 10రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలుపలికి వెళ్లిపోవాలి. 11అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు.
12శిబిరం బయట మల విసర్జనకు మీకు ఒక చోటుండాలి. 13మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గరుండాలి. నువ్వు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి. 14మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో.
వివిధ నియామాలు, చట్టాలు
15తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు. 16అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒకదాన్లో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు.
17 # 23:17 ఇక్కడ వేశ్యరికాలు, పురుష సంపర్కాలు అన్య దేవుళ్ళ ఆలయాల గురించిన సందర్భంలో చెప్పారు. ఇలాంటివి ఆలయాల్లో మాత్రమే కాదు, అసలు చేయకూడదు. ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు. 18పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
19మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు. 20పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు.
21మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది. 22ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు. 23మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి.
24మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు. 25మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in