YouVersion Logo
Search Icon

ఆమోసు 9

9
పరిశుద్ద స్థల నిర్మూలం
1బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు. “గడపలు కదలిపోయేలా స్తంభాల పై భాగాలను కొట్టు.
పై కప్పు అందరి తలల మీదా పడేలా వాటిని పగలగొట్టు.
తరువాత మిగిలిపోయిన వారిని నేను కత్తితో చంపుతాను.
ఎవడూ పారిపోలేడు. ఎవడూ తప్పించుకోలేడు.
2చచ్చిన వాళ్ళుండే చోటుకు వాళ్ళు చొచ్చుకు పోయినా
అక్కడనుంచి నా చెయ్యి వాళ్ళను బయటికి లాగేస్తుంది.
వాళ్ళు ఆకాశానికి ఎక్కిపోయినా
అక్కడ నుంచి వాళ్ళను దించేస్తాను.
3కర్మెలు పర్వత శిఖరాన వాళ్ళు దాక్కున్నా
నేను వాళ్ళను వెతికి పట్టుకుంటాను.
నా దృష్టికి కనబడకుండా వాళ్ళు సముద్రపు అడుగున దాక్కున్నా
వాళ్ళను కాటేయడానికి నేను పాముకు ఆజ్ఞాపిస్తాను.
అది వాళ్ళను కాటేస్తుంది.
4శత్రువులు వాళ్ళను బందీలుగా వేరే దేశాలకు తీసుకుపోయినా
నేనక్కడ కత్తికి పని చెబుతాను. అది వాళ్ళను చంపేస్తుంది.
మేలు చేయడానికి కాక కీడు చేయడానికే నా దృష్టి వారి మీద నిలుపుతాను.
5ఆయన సేనల అధిపతి యెహోవా.
ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది.
దానిలో జీవించే వారంతా రోదిస్తారు.
నైలునది లాగా అదంతా పొంగుతుంది.
ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి,
మళ్ళీ అణిగి పోతుంది.
6ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు.
భూమి మీద తన పునాది వేసినవాడు.
సముద్రపు నీళ్ళను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే.
ఆయన పేరు యెహోవా.
7ఇశ్రాయేలీయులారా, మీరూ ఇతియోపియా ప్రజలూ నా దృష్టిలో సమానులే గదా!
నేను ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను,
క్రేతు నుంచి ఫిలిష్తీయులను,
కీరు నుంచి అరామీయులనూ రప్పించాను గదా!
8యెహోవా ప్రభువు కళ్ళు ఈ పాపిష్ఠి రాజ్యాన్ని చూస్తున్నాయి.
దాన్ని భూమి మీద ఉండకుండాా నాశనం చేస్తాను.
అయితే యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.”
యెహోవా వెల్లడించేది ఇదే.
9“చూడండి. నేనొక ఆజ్ఞ ఇస్తాను.
ఒకడు ధాన్యాన్ని జల్లెడలో పోసి
ఒక్క గింజ కూడా కింద పడకుండా జల్లించినట్టు,
ఇశ్రాయేలీయులను అన్ని రాజ్యాల మధ్యకు జల్లిస్తాను.
10‘విపత్తు మన దరి చేరదు. మనలను తరమదు’ అని నా ప్రజల్లో అనుకునే
పాపాత్ములంతా కత్తితో చస్తారు.”
ఇశ్రాయేలు పూర్వపు వైభవ స్థితి నెలకొనడం
11పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి
దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను.
ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను.
12వాళ్ళు ఎదోములో మిగిలిన వారిని
నా పేరు పెట్టుకున్న రాజ్యాలన్నీ
నా ప్రజలు స్వాధీనం చేసుకునేలా చేస్తాను.
ఇలా చేసే యెహోవా ప్రకటన ఇదే.
13“రాబోయే రోజుల్లో పంటకోసేవాడు పొలం దున్నే వాడి వెంటే వస్తాడు.
విత్తనం చల్లుతుండగానే ద్రాక్షపళ్ళు తొక్కేవాళ్ళు వస్తారు.
పర్వతాలు తియ్యటి ద్రాక్షారసం స్రవిస్తాయి.
కొండలన్నీ దాన్ని ప్రవహింప చేస్తాయి.
యెహోవా ప్రకటించేది ఇదే.
14బందీలుగా దేశాంతరం పోయిన నా ప్రజలలైన ఇశ్రాయేలీయులను నేను తిరిగి తీసుకు వస్తాను.
శిథిలమైన పట్టణాలను మళ్ళీ కట్టుకుని వాళ్ళు వాటిలో నివసిస్తారు.
ద్రాక్షతోటలు నాటి వాటి ద్రాక్షారసాన్ని తాగుతారు.
తోటలు వేసి వాటి పళ్ళు తింటారు.
15వారి దేశంలో నేను వాళ్ళను నాటుతాను.
నేను వారికిచ్చిన దేశంలోనుంచి వారిని ఇక ఎన్నటికీ పెరికి వేయడం జరగదు.”
మీ యెహోవా దేవుడు చెబుతున్నాడు.

Currently Selected:

ఆమోసు 9: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in