YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 1

1
పరిచయం
1తియొఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత 2ఆయన పరలోకానికి ఆరోహణమైన రోజు వరకూ ఆయన చేసిన, బోధించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథాన్ని రచించాను. 3ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు.
క్రీస్తు పునరుత్థానానంతర పరిచర్య
4ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. 5యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”
6వారు సమకూడినప్పుడు, “ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?” అని శిష్యులు అడగగా ఆయన, 7“కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.
అపొస్తలిక ఆదేశం
8 “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు. 9ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.
10ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి, 11“గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు.
పరిశుద్ధాత్మకై పది దినాల నిరీక్షణ
12అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది. 13వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, ఉద్యమ కారుడైన సీమోను, యాకోబు కుమారుడు యూదా. 14వీరూ, వీరితో కూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
మత్తీయ ఎంపిక
15ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి, 16“సోదరులారా, యేసును పట్టుకున్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది. 17ఇతడు మనలో ఒకడుగా లెక్కలోకి వచ్చి ఈ పరిచర్యలో భాగం పొందాడు. 18ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బుతో ఒక పొలం కొన్నాడు. అతడు తలకిందులుగా పడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి. 19ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని ‘అకెల్దమ’ అంటున్నారు. దాని అర్థం ‘రక్త భూమి.’
ఇందుకు రుజువుగా,
20‘అతని ఇల్లు పాడైపోవు గాక,
దానిలో ఎవ్వడూ కాపురముండకపోవు గాక,
అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక,’
అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది.
21“కాబట్టి యోహాను బాప్తిసమిచ్చింది మొదలు ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిన రోజు వరకూ, 22ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి” అని చెప్పాడు. 23అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనే మారు పేర్లున్న యోసేపునూ, మత్తీయనూ నిలబెట్టి, 24ఈ విధంగా ప్రార్థించారు. “అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ, 25తన చోటికి వెళ్ళడానికి యూదా దారి తప్పి పోగొట్టుకొన్న ఈ పరిచర్యలో, అపొస్తలత్వంలో పాలు పొందడానికి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొన్న వాణ్ణి చూపించు.” 26తరువాత శిష్యులు వారిద్దరి మీదా చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in