YouVersion Logo
Search Icon

1 పేతురు పత్రిక 4

4
1క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు. 2ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. 3యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు. 4వారితోబాటుగా మీరూ ఇలాటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు.
5బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి. 6అందుకే చనిపోయిన వారు మానవ రీతిగా వారి శరీరానికి తీర్పు జరిగినా వారి ఆత్మ దేవునిలో జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది.
7అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా, ప్రార్థనల్లో చైతన్య వంతులుగా ఉండండి. 8అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.
12ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు. 13క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో సంతోషించేలా, క్రీస్తు పడిన హింసల్లో మీరు పాలివారైనట్టు ఆనందించండి. 14క్రీస్తు నామాన్ని బట్టి మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమా స్వరూపి అయిన ఆత్మ, అంటే దేవుని ఆత్మ మీమీద నిలిచి ఉన్నాడు.
15మీలో ఎవడూ హంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, పరుల జోలికి పోయేవాడుగా బాధ అనుభవించకూడదు. 16ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే సిగ్గు పడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమ పరచాలి. 17దేవుని ఇంటి వారికి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలయితే, దేవుని సువార్తకు లోబడని వారి గతేంటి? 18నీతిమంతుడే రక్షణ పొందడం కష్టమైతే ఇక భక్తిహీనుడు, పాపి సంగతి ఏమిటి? 19కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in