YouVersion Logo
Search Icon

1 యోహాను పత్రిక 3

3
1మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు. 2ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.
3ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు. 4పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.
5మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు. 6ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు.
7పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు. 8పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.
9దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు. 10నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.
చిన్నపిల్లలు కలిసి నివసించాలి
11మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు. 12సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.
13నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు.
16యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
18నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి. 20మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.
21ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. 22అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం. 23ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
24దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in